దేశంలో కరోనా కేసుల సంఖ్య 50,000కు చేరువలో ఉంది. కరోనాను కట్టడి చేయడం కోసం ప్రపంచ దేశాలు లాక్ డౌన్, సామాజిక దూరంపై ఆధారపడ్డాయి. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను కట్టడి చేసే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం ప్రపంచ దేశాలన్నీ పరిశోధనలు చేస్తున్నాయి. అయితే తాజాగా ఇటలీ శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ గురించి సంచలన ప్రకటన చేశారు. 
 
ఇటలీ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఎస్ఏ ఆ దేశపు శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టినట్టు ప్రకటన చేసింది. ఎలుకలపై వ్యాక్సిన్ ను ప్రయోగించగా వాటిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని పేర్కొంది. రోమ్‌లోని స్పల్లాంజనీ హాస్పిటల్‌లో ఈ వ్యాక్సిన్ ను పరీక్షించారని ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది. మరికొన్ని రోజుల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
వ్యాక్సిన్ ద్వారా కరోనాను తటస్థీకరించామని... మానవులపై కూడా వ్యాక్సిన్ అద్భుతంగా పని చేస్తుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇటాలియన్ శాస్త్రవేత్తలు ఫలితాలు ప్రోత్సాహకరంగా, అంచనాలకు మించి ఉన్నాయని చెబుతున్నారు. ఇటలీ దేశంలో 2,00,000 మంది కరోనా భారిన పడగా 30,000 మంది మృతి చెందారు. తాజాగా ఇజ్రాయెల్ కు చెందిన బృందం కరోనా వ్యాక్సిన్ డిజైన్ ను రూపొందించినట్టు ప్రకటన చేసింది. ఈ డిజైన్ కు అమెరికా పేటెంట్ కూడా వచ్చింది. 
 
మరోవైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా ధాటికి చిగురుటాకులా వణికిపోతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలోని కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో మాత్రం ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాలేదు.              

మరింత సమాచారం తెలుసుకోండి: