దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు వల్ల వ్యాపార, వాణిజ్య సేవలు స్తంభించిపోయాయి. లాక్ డౌన్ వల్ల ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. దేశంలో దాదాపు 80 శాతం ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ద్వారా పని చేస్తున్నారు. అయితే సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగుల శ్రమను దోచేస్తున్నాయని తెలుస్తోంది. 
 
దేశంలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్ వల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారే కరువయ్యారు. మన దేశంలోని చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు విదేశాల్లోని కంపెనీల నుంచి ప్రాజెక్టులు తీసుకొని సేవలందిస్తున్నాయి. లాక్ డౌన్ ప్రకటించిన తరువాత పలు కంపెనీలు ఉద్యోగులు 12 నుంచి 14 గంటలు పని చేయాలని కోరుతున్నాయని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. 
 
చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు లాక్ డౌన్ ప్రకటించక ముందే పది గంటల నుండి 12 గంటలు పని చేయించుకున్నాయని పలువురు ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. ఎక్కువ పనిగంటలు పని చేసినా... ఎక్కువ జీతం ఇవ్వరని కొన్ని కంపెనీలు మాత్రమే ఎక్కువ పనిగంటలకు వేతనం చెల్లిస్తున్నాయని ఐటీ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలాన్నీ ఆగిపోయాయి. 
 
లాక్ డౌన్ సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్న వారికి ప్రాజెక్టులు ఇచ్చే కంపెనీలు సాధారణంగా ఇచ్చే మొత్తం కంటే ఎక్కువ మొత్తం ఇస్తున్నాయని సమాచారం. కానీ మన ఐటీ కంపెనీలు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఎక్కువ మొత్తం చెల్లించడం లేదు.  రాత్రీపగలు కంప్యూటర్ ముందు పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పని ఒత్తిడి వల్ల మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. మరోవైపు పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులు వారానికి 60 గంటలు పని చేయాలని పిలుపునిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ లో ఈ తరహా దోపిడీ జరుగుతోందని పలువురు ఉద్యోగులు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: