దేశంలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య 50 వేలకు చేరువైంది. గత మూడు రోజులుగా కరోనా చెలరేగిపోతోంది.  మహారాష్ట్ర, గుజరాత్ లో కరోనా తన ప్రతాపమేంటో చూపిస్తోంది. మహారాష్ట్రలో పరిస్థితిపై సీఎం ఉద్ధవ్ థాక్రేతో మాట్లాడతానని కేంద్ర మంత్రి హర్షవర్థన్ స్పష్టం చేశారు.  

 

భారత్‌లో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. గత మూడు రోజులుగా దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,958 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా మరో 126మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 49 వేల 391కు చేరింది. 1694మంది మృత్యువాతపడినట్టు కేంద్రం ప్రకటించింది.  

 

మహారాష్ట్రలో కోవిడ్‌ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. ఒక్కరోజే రాష్ట్రంలో 984కొత్త కేసులు, 34మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15 వేల 525కి చేరగా 617మంది మృత్యువాతపడ్డారు. ముంబయి మహానగరంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గుజరాత్‌లో ఒకేరోజు అత్యధికంగా 441కేసులు నిర్ధారణ అవడంతోపాటు ఒక్కరోజే 49మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6245కి చేరగా ఇప్పటివరకు 368మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఒకేరోజు 206 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఢిల్లీలో ఈ వైరస్‌ బారినపడినవారి సంఖ్య 5,104కి చేరగా 64మంది మరణించారు. తమిళనాడులో గత రెండు రోజులుగా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది.  ఒక్కరోజే రాష్ట్రంలో 508కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4058కి చేరగా 33మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3049 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు 176మంది మరణించారు.


దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ విశ్వరూపం చూపుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఆందోళన కలిగించే అంశమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఈ పరిస్థితిపై సమీక్షించేందుకు మహా సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో త్వరలోనే మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు. అయితే దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. ఈ ఒక్కరాష్ట్రంలో 15,500పైగా కరోనా కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: