కరోనా విషయంలో జాతీయ సగటు కంటే ఏపీ మెరుగైన స్థానంలో ఉందన్నారు సీఎం జగన్. వలస కూలీల విషయంలో ఉదారంగా ఉండాలని సూచించారు. ప్రయాణ ఖర్చులతో పాటు భోజన వసతి కూడా కల్పించాలని, దారి ఖర్చులకు 500 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పారు జగన్. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ సౌకర్యాలపై దృష్టి పెట్టాలన్నారు సీఎం. 

 

కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. వలస కూలీల తరలింపుపై అధికారులతో చర్చించారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి లక్షన్నర మంది వస్తారని అంచనా వేశారు. విదేశాల నుంచి వచ్చేవారిని విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టుల్లో మెడికల్ స్క్రీనింగ్ చేయాలన్నారు జగన్. క్వారంటైన్ చేసిన తర్వాతే.. స్వస్థలాలకు పంపాలని స్పష్టం చేశారు. ఆయా దేశాల్లో కరోనా తీవ్రత ఆధారంగా.. విదేశాల నుంచి వచ్చేవారిని వర్గీకరించాలన్న జగన్.. గల్ఫ్ నుంచి వచ్చేవారి క్వారంటైన్ పైనా దృష్టి పెట్టాలని చెప్పారు. 

 

వలస కూలీల విషయంలో ఉదారంగా ఉండాలని జగన్ సూచించారు. థానే నుంచి గుంతకల్ వచ్చిన వెయ్యి మంది వలస కూలీలకు పరీక్షలు చేశామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో తొమ్మిది చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్ తో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు జగన్. పరిశ్రమల్లో పనులకు వెళ్తానంటే సహకరించాలని, స్వస్థలాలకు వెళ్తామంటే ప్రయాణ సౌకర్యం కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. వలస కూలీలకు వెళ్లేటప్పుడు దారి ఖర్చుల కింద ఐదు వందల రూపాయలు ఇవ్వాలని జగన్ చెప్పారు. 

 

ఇతర రాష్ట్రాల్లో మన కూలీలు ఇక్కడకు వచ్చేందుకు.. అక్కడి ప్రభుత్వాలు సహకరించకపోతే.. మనం వెనుకడుగు వేయాల్సిన పనిలేదన్నారు జగన్. అవసరమైతే వారి ప్రయాణ ఖర్చులు కూడా భరించాలని స్పష్టం చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారి ప్రయాణాలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు జగన్.

 

వరుసగా రెండుసార్లు పరీక్షల్లో నెగటివ్ వచ్చిన కోవిడ్ బాధితుల్నే డిశ్చార్జ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. కరోనా కేసుల డిశ్చార్జి, పాజిటివిటీ రేటులో జాతీయ సగటు కంటే ఏపీ మెరుగ్గానే ఉందన్నారు. రైతుల విషయంలో అధికారులు అగ్రెస్సివ్ గా ఉండాలని చెప్పారు జగన్. 

 

అంతరాష్ట్ర రాకపోకలపై మార్గదర్శకాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీలో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను తరలించేందుకు శ్రామిక్ రైళ్లను వినియోగిస్తున్నట్టు తెలిపింది.  ప్రభుత్వ రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారిని ఆయా రాష్ట్రాల అనుమతులతో శ్రామిక్ రైళ్ల ద్వారా పంపనుంది. రిలీఫ్ క్యాంపుల నుంచి రైల్వే స్టేషన్లకు ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించనున్నారు.  అత్యవసర సమయాల్లో తప్ప వ్యక్తిగతంగా రాకపోకలకు అనుమతి నిరాకరించింది.ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ప్రైవేట్ కంపెనీలు జారీ చేసే ధృవ పత్రాలతో ప్రైవేట్ ఉద్యోగులు రాకపోకలు సాగించవచ్చని చెప్పింది.    

మరింత సమాచారం తెలుసుకోండి: