కేంద్రం దేశవ్యాప్తంగా వలస కూలీలను సొంతూళ్లకు తరలించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లకు సంబంధించిన ఖర్చులలో కేంద్రం 85 శాతం భరిస్తుండగా రాష్ట్రాలు 15 శాతం భరిస్తున్నాయి. అయితే కేరళ ఈ 15 శాతం వాటా విషయంలో తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
కరోనా కట్టడి విషయంలో సక్సెస్ అయిన కేరళ కూలీల నుంచి నగదు వసూలు చేసిందని తెలుస్తోంది. ఎర్నాకుళం రైల్వే అధికారులు వలస కూలీలను విచారించగా కొందరు వలసకూలీలు ప్రభుత్వం తమ దగ్గరి నుంచి 530 రూపాయలు వసూలు చేసిందని చెప్పారు. 90 శాతం మంది పెద్దల దగ్గర నగదు వసూలు చేసిందని... పది శాతం మంది పిల్లల దగ్గర నగదు వసూలు చేయలేదని తెలుస్తోంది. 
 
కేరళ ప్రభుత్వం 530 రూపాయల చొప్పున ఒక్కొక్కరి నుంచి వసూలు చేశామని... తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల నుంచి నగదు వసూలు చేయాల్సి వచ్చిందని... లక్షలాది మంది వలస కూలీలను వారి రాష్ట్రాలకు పంపాలంటే బోలెడంత ఆర్థిక భారం కాబట్టి డబ్బులు వసూలు చేసినట్టు చెబుతోందని సమాచారం. మరికొంత మంది కూలీలు ప్రభుత్వం తమ దగ్గరి నుంచి 745 రూపాయలు వసూలు చేసిందని చెబుతున్నారు. 
 
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వలస కూలీలకు బియ్యం, నగదు అందజేసేలా చర్యలు చేపట్టారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలకు 500 రూపాయలు అందజేయాలని ఆదేశించారు. ఎవరైనా పనులు చేసుకుంటామంటే వారికి పనులు కల్పించాలని కూడా సూచిస్తున్నారు. పలు రాష్ట్రాలు వలస కూలీలకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరిస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు మాత్రం వలస కూలీల నుంచే డబ్బులు వసూలు చేయడంపై వారి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: