కరోనా లాక్‌డౌన్‌తో అనేక మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. ఇందులో ఉపాధి కోసం వెళ్లి... కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లందర్నీ భారత్‌కు రప్పించే ప్రక్రియ ప్రారంభమైంది. కానీ క్వారంటైన్‌ విషయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. అయితే ఈ వ్యవహారంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 


 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడంతో మార్చి 25న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన కేంద్ర  ప్రభుత్వం. అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో విదేశాలకు వెళ్లిన చాలా మంది  భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. వీళ్లలో కొంత మందిని ప్రత్యేక విమానాల్లో రప్పించింది  ప్రభుత్వం. వివిధ కారణాల వల్ల చాలా రాలేకపోయారు. వీరితో పాటు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన చాలా మంది... కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వాళ్లంతా భారత్‌కు తిరిగి వచ్చేయాలని భావిస్తున్నారు. దీంతో వీళ్లందర్నీ దశల వారీగా భారత్‌కు తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వం.

 

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే విషయంపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. దీనికి సంబంధించిన విధి విధానాలను సైతం రూపొందించింది. రెండు రోజుల క్రితం కేంద్ర హోం శాఖ స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ - SOP విడుదల చేసింది. దీని ప్రకారం భారత్‌కు తిరిగి రావాలనుకునే వాళ్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే క్వారంటైన్‌ సెంటర్ లో తమ సొంత ఖర్చులతో రెండు వారాల పాటు ఉంటామని అంగీకారపత్రం అందజేయాల్సి ఉంటుంది. అలాగే, తమ పేర్లను నమోదు చేయించుకునే సమయంలో అక్కడి ఇండియన్‌ మిషన్‌కు రివర్స్‌ ట్రాస్క్రిప్షన్‌-పాలీమెర్సీ చైన్‌ రియాక్షన్‌ - RC-PCR పరీక్ష నివేదికను అందజేయాల్సి ఉంటుంది. 

 

స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ - SOP ప్రకారం కరోనా లక్షణాలు ఉన్న వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది. అలాగే, మిగతా వాళ్లను రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని క్వారంటైన్‌ సెంటర్లలో పెట్టాలి. 14 రోజుల తర్వాత నిర్వహించే కరోనా పరీక్షల్లో నెగటీవ్‌ వస్తే... ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించాలి. అయితే, ఇంటి వద్ద 2 వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలి. సరిగ్గా ఇక్కడే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. 

 

విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు వారంలోగా RC-PCR పరీక్ష నిర్వహిస్తామంటున్నాయి కేరళ లాంటి కొన్ని రాష్ట్రాలు. పాజిటీవ్‌ వస్తే ఆస్పత్రికి పంపాలని, నెగటీవ్‌ వచ్చిన వాళ్లను ఇంటికి పంపాలన్నది రాష్ట్రాల అభిప్రాయం. తర్వాత 2 వారాలు పాటు వాళ్లు హోం క్వారంటైన్‌లో ఉండాల్సింది. NRIలకు బయలుదేరే సమయంలో వైద్య పరీక్షలు చేయకూడదన్న కేంద్రం నిర్ణయానికి తగ్గట్టుగానే రాష్ట్రాలు ఈ మార్పును సూచిస్తున్నాయన్నది ఓ వాదన. అయితే, ఈ వ్యవహారంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా... పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.  

 

కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న పది దేశాల నుంచి వస్తున్న nri విషయంలో కూడా ఇదే రకమైన ప్రోటోకాల్‌ను పాటించడం కూడా ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ల్యాబ్‌ టెస్టుల ద్వారా కరోనాను కొనగొనాలంటే కనీసం ఆరు నుంచి ఏడు రోజులు పడుతుంది. 30 నుంచి 40 శాతం మందిలో మొదటి వారం రోజుల్లో నెగటీవ్‌ రావచ్చు... తర్వాత పాజిటీవ్‌గా మారొచ్చు. కొంత మందిలో కరోనా బయటపడడానికి వారం కంటే ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చంటున్నారు నిపుణులు. అయితే, ఎక్కడైనా తేడా జరిగితే పరిస్థితి పూర్తిగా చేయిదాటి పోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: