కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణలో ఆయన్ని మించిన నాయకుడు లేడు.. ఆయన మాట తెలంగాణం.. ఆయన పాట తెలంగాణం.. ఒక విధంగా ఆయన దరిదాపులకు వచ్చే పాటి నాయకుడు కూడా మరెవరూ లేరు. అందులోనూ ఇది రెండో దఫా ముఖ్యమంత్రి పాలన అయినా జనం ఇంకా కేసీఆర్ ను నెత్తినపెట్టుకోవడం మానలేదు. అయితే.. మాటల మాంత్రికుడుగా పేరున్న కేసీఆర్.. మాటల మరాఠీయే కాదు.. నటనలోనూ ఘనాపాఠి అంటున్నారు పాత్రికేయులు.

 

 

ఎందుకంటే.. తెలంగాణలో పాత్రికేయులకు కరోనా కారణంగా దుర్ధినాలు దాపురించాయి. కొన్ని మీడియా సంస్థలు కరోనా సాకు చూపి కొందరిని ఇంటికి పంపేశాయి. మరికొన్ని సంస్థలు జీతాలు కోసేశాయి. అలాంటి సంస్థల్లో స్వయంగా కేసీఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న నమస్తే తెలంగాణ సంస్థ కూడా ఉంది. కోత అంటే కోత అని పేరు పెట్టకుండా.. ప్రస్తుతానికి తగ్గించి ఇస్తున్నారు. ఆ తర్వాత తగ్గించిన సొమ్ము ఇస్తామని చెబుతున్నా.. ఇస్తారన్న భరోసా కరోనా సమయంలో కనిపించడం లేదు.

 

 

పత్రికల యాజమాన్యాలు చేస్తున్న అరాచకాలను స్వయంగా కేసీఆర్ ప్రెస్ మీట్‌లో ఓ విలేఖరి ప్రశ్నించాడు.. లాక్‌ డౌన్‌ లో జర్నలిస్టులు జీతాలు సరిగ్గా లేక ఇబ్బందుల్లో ఉన్నారు.. మీరే ఏదైనా సాయం చేయాలి అని అడిగాడు. దాంతో కేసీఆర్ అదేంది..? మీ యాజమాన్యాలు ఇవ్వడం లేదా..? నేనెందుకివ్వాలి..? అంటూ ఎదురు ప్రశ్నించారు. అందుకా జర్నలిస్టు.. లేదు సార్, సరిగ్గా ఇవ్వడం లేదు, జీతాలు కోసేస్తున్నారు అని సమాధానం ఇచ్చాడు.

 

 

అంతే.. కేసీఆర్.. ఔనా, నిజమా..? ఎట్లా కట్ చేస్తారు..?, నిజంగా కట్ చేస్తున్నారా ఇప్పుడు.. ఇది చాలా దుర్మార్గం.. ఇంత అన్యాయం ఉంటుందా..? సరే, ఎందుకట్ల చేస్తున్నారో అడుగుతా.. నేను సీరియస్‌గా చెబుతున్నా, జోక్ చేయడం లేదు.. రేపు ఎవరైనా ఓ ఇద్దరు జర్నలిస్టులు ఫిర్యాదు ఇవ్వండి అని సమాధానం ఇచ్చారు.

 

 

దీంతో జర్నలిస్టులు అవాక్కయ్యారు. మీడియా సంస్థల్లో ఏం జరుగుతున్నదో తనకు నిజంగానే ఏమీ తెలియనట్టు..? స్వాతిముత్యంలో కమల్‌హాసన్‌ ను మించిన అమాయకపు ఫేసు పెట్టాడని చెప్పుకుంటున్నారు. మిగిలిన మీడియా సంగతి ఎలా ఉన్నా.. తన సొంత పత్రిక 'నమస్తే తెలంగాణ'లో జీతాలు కోసేస్తున్నారనే సంగతి కూడా తనకు తెలియదా..? రేప్పొద్దున జర్నలిస్టులు నమస్తే తెలంగాణ ఓనర్ అయిన కేసీయార్ మీద చర్య తీసుకోవాలని సీఎం కేసీయార్‌ కు ఫిర్యాదు చేయాలా..? వారెవ్వా.. ఏమీ నటన అంటూ సెటైర్లు వేస్తున్నారు. నిజమే కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: