వైద్య విద్య అందని ద్రాక్షగా మారిపోతోందా? డబ్బున్నోళ్ళకే డాక్టర్ కోర్సు అందుబాటులో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వసతుల కల్పన ఊసేలేని ప్రైవేట్‌ మెడికల్ కాలేజీలు వసూళ్ల విషయంలో మాత్రం రెచ్చిపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పీజీ మెడికల్ కౌన్సిలింగ్ సమయంలో ఫీజులను భారీగా పెంచడంపై ఆగ్రహం వ్యక్తమౌతోంది. 

 

వైద్యవిద్య అంటే అది ధనవంతులకే అన్నట్టు మారిపోతోంది పరిస్థితి. నిర్వహణ భారంగా మారిందంటూ ఫీజులను భారీగా పెంచుతున్నాయి ప్రైవేట్‌ మెడికల్ కాలేజీలు. ఇక మెడికల్‌ పీజీ కోర్సుల విషయానికొస్తే... సామాన్యులకు అందని ద్రాక్షగా మారుతోంది. 

 

ఎంబీబీఎస్ తర్వాత నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలంటే స్పెషలైజేషన్లు చేయాలి. అయితే ఇప్పటికే ఎంబీబీఎస్ కు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ మెడికల్ కాలేజీలు పీజీ కోర్సుల్లోనూ బాదుడు తెరలేపాయి. ఫీజులను భారీగా పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. 

 

తెలంగాణలో మెడికల్, డెంటల్ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ మొదలైంది. అయితే ప్రైవేట్‌ కాలేజీలు ఫీజుల్ని పెంచుకోవచ్చంటూ జారీ అయిన జీవో విద్యార్థుల గుండెలపై బండరాయిలా పడింది. తాజా జీవో ప్రకారం ఏ కేటగిరీలో ఫీజు 7 లక్షల రూపాయల నుంచి 7లక్షల 75 వేలు రూపాయలుగా ఉంది. బీ కేటగిరీలో 24 లక్షల 20 వేల రూపాయలుంటే, సీ కేటగిరీలో ఏకంగా 72 లక్షల రూపాయలు వసూలు చేసుకునే అవకాశం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

2017లో పీజీ కాలేజీల్లో ఫీజులను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీఓపై డాక్టర్ల సంఘాలు కోర్టుకు వెళ్ళాయి. దీంతో ఫీజుల పెంచొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. అయితే... తుది తీర్పు ఇంకా రాకుండా మళ్ళీ ఫీజులు ఎలా పెంచారన్న ప్రశ్నకు సమాధానం లేదు. 

 

ప్రభుత్వం మాత్రం అన్నీ ఆలోచించే పీజీ మెడికల్ ఫీజుల్ని పెంచామంటోంది. ఫీజుల నియంత్రణ కమిటీతో సంప్రదింపులు జరిపాకే ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది. మరోవైపు... ఇది కోర్టు ధిక్కారమే అంటున్నాయి డాక్టర్ల సంఘాలు. ఈ పరిస్థితుల్లో వివాదానికి ఎలాంటి ముగింపు లభిస్తుందో వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: