నిన్న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విశాఖలోని ఎల్.జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ అనే విషవాయువు లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ వల్ల ఇప్పటివరకు 12 మంది మృత్యువాత పడగా వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే అధికారుల ప్రాథమిక పరిశీలనలో విశాఖ గ్యాస్ లీకేజీకి అసలు కారణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులు స్టైరీన్ రసాయనం 20 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. 
 
ఎల్.జీ పాలిమర్స్ సంస్థ ఈ ఫ్యాక్టరీలో థర్మోకోల్ గ్రాన్యూల్స్ ను తయారు చేస్తుంది. స్టైరీన్ రసాయనాన్ని ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. మార్కెట్లో థర్మోకోల్ గ్రాన్యూల్స్ కు భారీ డిమాండ్ ఉంది. ఈ రసాయనాన్ని 20 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేయాల్సి ఉంటుంది. సిబ్బంది నిత్యం ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తూ ఉండాలి. ఉష్ణోగ్రత పెరిగితే స్టైరీన్ నుంచి విషపూరితమైన వాయువు విడుదలవుతుంది. 
 
విషపూరితమైన ఆవిరిని పీలిస్తే శరీరంపై దద్దుర్లు, కళ్ల మంటలు వస్తాయి. ఈ ఆవిరి జంతువుల, మనుషుల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిన్న ఉదయం స్టైరీన్ నుంచి ఆవిరి విడుదల కావడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆవిరి గాలిలో కలిసిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరైపోయారు. నిపుణులు ట్యాంకులు పేలిపోయి ఉంటే మరింత పెను ప్రమాదం జరిగేదని చెబుతున్నారు. 
 
లీకైన స్టైరీన్ గ్యాస్ పరిశ్రమ చుట్టుపక్కల 15 కిలోమీటర్ల వరకు వ్యాపించిందని అధికారుల పరిశీలనలో తేలింది. పరిశ్రమ చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో ఆవిరి గాఢత ఎక్కువగా ఉండటంతో అధికారులు ఆయా ప్రాంతాలకు ఖాళీ చేయించారు. ప్రమాదం జరిగిన సమయంలో సంస్థలో 15 మంది ఉన్నారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 1800 టన్నుల వరకు స్టైరీన్ ఉన్నట్టు అధికారులు తేల్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: