నిన్న తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో విశాఖలోని ఎల్.జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టేరైన్ గ్యాస్ లీకైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో బాధితుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేసిన ఫోన్ కాల్ ఆడియో టేపు బయటకు వచ్చింది. బాధితుడు మేము చనిపోతున్నామంటూ చేసిన వ్యాఖ్యలు వింటే వాళ్లు పడిన మానసిక ఆవేదన అర్థమవుతుంది. 
 
 
యువకుడు ఫోన్ కాల్ లో గోపాలపట్నం వెంకట్రాద్రి గార్డెన్స్ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లిక్విడ్ విడులవుతోందని... చచ్చిపోతామని భయమేస్తోందని... కొంత సమయం ఆగితే చనిపోతామని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ఈ ఆడియో టేప్ తెగ వైరల్ అవుతోంది. యువకుడు ఫోన్ కాల్ లో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడినట్టు తెలుస్తోంది. అధికారులు గ్యాస్ ప్రభావిత ఐదు గ్రామాల నుంచి ప్రజలను తరలించారు. 
 
మిగిలిన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురి కావద్దని వారు చెబుతున్నారు. అధికారులు ప్రజలంతా సంయమనం పాటించాలని... వదంతులను నమ్మవద్దని సూచించారు. సీపీ ఆర్కే మీనా ప్రజలు ఏదైనా అత్యవసరమైతే 100 నంబర్ కు డయల్ చేయాలని సూచించారు. ఎల్జీ పాలిమర్స్ దగ్గర పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇతర గ్రామాల ప్రజలు ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండవచ్చని చెబుతున్నారు. 
 
స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఈరోజు ఉదయం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం పరిశ్రమలో పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయని చెప్పారు. ప్రత్యేక బృందాల సహాయసహకారాలతో చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయని అన్నారు. మరోవైపు నిన్న అర్ధరాత్రి నుంచి విశాఖ ఎల్జీ పాలిమర్స్ నుంచి భారీ స్థాయిలో రసాయనాలు లీకైనట్లు సమాచారం. మరోవైపు నిన్న ఛత్తీస్ గఢ్, తమిళనాడు రాష్ట్రాలలో సైతం ఇలాంటి ఘటనలే చోటు చేసుకోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: