మందు బాబుల‌కు ఓ గుడ్ న్యూస్‌. లాక్ డౌన్ స‌మ‌యంలో ఇప్ప‌టికే మందు బాబులు తీపి క‌బురు విన్న సంగ‌తి తెలిసిందే. మార్చి 25వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ వ‌ల్ల మ‌ద్యం షాపులు మూత‌ప‌డ్డాయి. అయితే నాలుగు రోజుల నుంచి కొన్ని రాష్ట్రాలు మ‌ద్యం అమ్మ‌కాల‌ను మొద‌లుపెట్టాయి. దీంతో జ‌నం ఒక్క‌సారిగా షాపుల ముందు చేరుకుంటున్నారు. కిలోమీట‌ర్ల కొద్ది క్యూలైన్లు ఉంటున్న నేప‌థ్యంలో ఈ అవ‌స్థ‌లు తప్పించేందుకు కోర్టు కీల‌క‌ సూచ‌న చేసింది.  హోమ్ డెలివ‌రీ మ‌ద్యం అమ్మ‌కాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించింది. 

 


దాదాపు నెల‌న్న‌ర త‌ర్వాత మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో మ‌ద్యం కొనుగోలు చేసేందుకు మందు బాబులు షాపులు తెర‌వ‌క‌ముందే దుకాణాల ముందుకొచ్చి క్యూ క‌డుతున్నారు. మద్యం ప్రియ‌లు మందు కొనుక్కొనేదాకా తిరిగి వెళ్లే ప్ర‌సక్తే లేద‌న్న‌ట్లుగా చాలా ఓపిగ్గా తెల్ల‌వారుజాము నుంచే షాపు ముందు నిల‌బ‌డి..ఎపుడు దుకాణం తెరుస్తారా..? అని ఎదురుచూస్తున్నారు. మందు బాబుల‌తో మ‌ద్యం షాపుల వ‌ద్ద భారీ జ‌న ‌స‌మూహాలు స‌ర్వ‌సాధార‌ణం అయిపోయాయి. దీంతో ప్ర‌జ‌ల్లో క‌రోనా భ‌యాలు పెరిగిపోయాయి. ఈ విష‌యంలో సుప్రీంకోర్టులో పిల్ దాఖ‌లైంది. దీన్ని జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌, సంజ‌య్ కృష్ణ కౌల్‌, బీఆర్ గ‌విల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా విచారించింది. జ‌న స‌మూహం అరిక‌ట్టేందుకు హోం డెలివ‌రీ అవ‌స‌ర‌మ‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది.  వాస్త‌వానికి ఈ కేసులో కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయ‌లేదు. సోష‌ల్ డిస్టాన్సింగ్ అమ‌లు చేయాలంటే.. మ‌ద్యాన్ని హోం డెలివ‌రీ చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ట్లు కోర్టు చెప్పింది.  సుప్రీంకోర్టు సూచ‌న‌ల నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సింది. 

 

ఇదిలాఉండ‌గా, జ‌న స‌మూహం బాధ‌ను త‌ప్పించుకునేందుకు మందుబాబుల ప్ర‌త్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఢిల్లీలోని వ‌సంత్ విహార్ ఏరియాలో ఓ మ‌ద్యం షాపు ద‌గ్గ‌ర‌ సామాజిక దూరం పాటించేలా గుండాలు గీశారు. కొంత‌మంది క్యూలైన్ లో నిల‌బ‌డేందుకు బ‌దులుగా త‌మ హెల్మెట్లు, వాట‌ర్ బాటిళ్లు, సాక్సులు..లైన్ లో వ‌రుస క్ర‌మంలో పెట్టుకున్నారు. మ‌ద్యం కోసం మందు బాబులు షాపుల క‌ష్టాలు చిత్రంగా ఉన్నాయ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: