హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ మొదలయింది. సాధారణ రోజులను తలపించేలా రోడ్లపై వాహనాలు తిరుగుతున్నా యి. సిగ్సల్స్‌ కూడా పనిచేస్తున్నాయి.  ఓ పక్క సడలింపులతో పాటు, ఉల్లంఘనలు కూడా తోడవటంతో వాహనాలు పెద్ద ఎత్తున రోడ్డెక్కుతున్నాయి. గల్లీలు, లోకల్ రోడ్లు మినహా ప్రధాన రహదారులపై ఇన్ని రోజులు వాహనాలు కనిపించలేదు. ఇళ్లకే పరిమితమైన నగరవాసులతో హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. కానీ మెల్లగా సీన్ మారుతోంది. లాక్ డౌన్ సడలింపులతో నగరంలో రోడ్లపై ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగింది. అదేసమయంలో లాక్ డౌన్ ఉల్లంఘనలూ పెరుగుతున్నాయి.

 

సాధారణ రోజుల్లో రోడ్లపై కనిపించే ట్రాఫిక్ తో  పోలిస్తే 35 శాతం వాహనాలు రోడ్లపైకి వస్తున్నట్లుగా అధికారులు అంచనా వేశారు.  అదీగాక మద్యం దుకాణాలకు అనుమతి రావడంతో రోడ్లపై మరింత రద్దీ కనిపిస్తోంది. ఓవరాల్ గా హైదరాబాద్లో మళ్లీ పూర్వ స్థితి కనిపిస్తోంది. దాదాపు నెలన్నర తర్వాత వాహనాలు భారీగా రోడ్డెక్కుతున్నాయి. 


లాక్ డౌన్ త్రీలో భాగంగా ప్రభుత్వం కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. దీంతో ఆయా రంగాలకు చెందిన వారు ఇళ్ల నుంచి బయటకి వస్తున్నారు. రవాణా, రిజిస్ట్రేషన్ శాఖలతోపాటు నిర్మాణ రంగానికి ప్రభుత్వం వెసులుబాట్లను కల్పించింది. ఐటీ ఉద్యోగులు కూడా 33 శాతం మంది కార్యాలయాలకు వెళ్లొచ్చని సూచించటంతో రోడ్లపై రద్దీ ఒక్కసారిగా పెరిగింది. 

 

మరోవైపు నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు కూడా తెరుచుకున్నాయి. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, సిమెంట్, స్టీలు దుకాణాలు తెరవడంతో వాటిలో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దీంతో గత రెండు రోజుల నుంచి నగరంలో వాహనాల రాకపోకల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

 

అయితే, ప్రజా రవాణ వ్యవస్థ లేకపోవడంతో సొంత వాహనాల్లోనే చాలా మంది విధులకు హాజరవుతున్నారు. దీంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పెరిగింది. దీంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చాలా వరకు సిగ్నల్స్ కూడా పనిచేస్తున్నాయి. పోలీసులు వాహనాలను ఆపి.. వారి అవసరాన్ని బట్టి విడిచిపెడుతున్నారు. మరోవైపు, లాక్ డౌన్ ఉల్లంఘనలు కూడా పెరుగుతున్నాయి. దీంతో అనవసరంగా రోడ్లపైకి వస్తున్నవారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: