విశాఖ ఎల్జీ పాలిమర్స్ దగ్గర పరిస్థితి అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. పరిసర గ్రామాల ప్రజలు ఇవాల్టికి శిబిరాల్లోనే ఉండాలనీ, రేపు ఎవరి గ్రామాలకు వాళ్లు వెళ్లొచ్చని చెప్పింది. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వచ్చిన నిపుణులు ఫ్యాక్టరీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 

 

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనతో ఎల్జీ పారిమర్స్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అపరేషన్‌కు అవసరమైన టీబీసీ రసాయనం అందుబాటులో ఉంచారు. గుజరాత్‌, నాగ్‌పూర్‌ నుంచి కూడా నిపుణుల బృందం చేరుకుంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, పరిశ్రమ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. నాలుగైదు గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్‌లో సహాయక చర్యలకు అన్ని ఏర్పాట్లు చేశారు. గాలి స్వచ్ఛత తెలుసుకునేందుకు పర్యావరణ విభాగం అధికారులు ఎల్జీ పాలిమర్స్‌లో ప్రత్యేక యంత్రం ఏర్పాటు చేశారు. దీని ద్వారా గాలిలోని పరిస్థితి, సాంద్రతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. శనివారం ఉదయానికి సాధారణ స్థితి వస్తుందని, ప్రస్తుతం స్టైరీన్ నిల్వ ఉన్న ట్యాంకులో ఉష్ణోగ్రత క్రమంగా తగ్గిస్తున్నామని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. 

 

ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకేజీ పూర్తిగా నిలిచిపోయింది. వేపర్‌ మాత్రం కొన్ని చోట్ల హెచ్చుతగ్గులుగా ఉంది. సమీప గ్రామాల ప్రజలు ఇవాల్టికి శిబిరాల్లోనే ఉండాలని, శనివారం ఉదయం ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లవచ్చని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. విశాఖ వాసులెవరూ భయాందోళనకు గురికావాల్సిన పనిలేదని, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ అధికారులు, నిపుణులు, ప్రభుత్వ అధికారులు అందరూ ఫ్యాక్టరీలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తిరిగి స్వస్థలాలకు చేరుకోవచ్చని ప్రభుత్వం  చెబుతున్నా ప్రజల్లో ఒకింత ఆందోళన నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: