ఏపీ అభివృద్ధి కోసమంటూ సీఎం జగన్ మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ నిర్ణయం అమలు దిశగా వెళుతున్న తరుణంలోనే మండలిలో ఇబ్బంది వస్తే, మండలి రద్దుకు సిఫారసు చేశారు. అటు కోర్టులో రాజధాని కేసు పెండింగ్ లో ఉండటం, ఆ వెంటనే కరోనా రావడంతో మూడు రాజధానుల మేటర్ కాస్త పెండింగ్ లో పడింది.

 

అయితే ప్రతిపక్ష టీడీపీ మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ పోరాటాలు, ఉద్యమాలు చేసిన విషయం తెలిసిందే. ఇక అమరావతి గ్రామ ప్రజలు ఇప్పటికీ దీక్షలు చేస్తున్నారు. కాకపోతే పార్టీలు అటువైపు వెళ్లడం లేదు. కరోనాపైనే ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. అయితే నారా లోకేష్ మాత్రం అమరావతి కోసం సైలెంట్ గానే పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏదొక సమయంలో ఆయన అమరావతి ఉద్యామాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు.

 

తాజాగా విశాఖ గ్యాస్ లీకేజ్ జరిగిన ఘటనపై వైసీపీ కార్యకర్తలు అమరావతిని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. అమరావతి పేరిట ఉన్న ఓ పేజ్ లో విశాఖ వాళ్లకు సరైందే జరిగిందంటూ పోస్ట్ పెట్టారు. అది వైసీపీ క్రియేట్ చేసిన నకిలీ పోస్ట్ అని లోకేష్ చెప్పే ప్రయత్నం చేస్తూ, అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

 

ఇక అలా అమరావతికి అండగా ఉంటున్న లోకేష్...తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణకు లేఖ రాసారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న పారిశుధ్య  కార్మికులకు జీతాలు చెల్లిచాలంటూ లేఖలో పేర్కొన్నారు. పెనుమాక  గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసనను ఈ లేఖకు జత చేస్తున్నానని, వారికి తక్షణమే జీతాలు చెల్లించాలని లోకేష్ సూచించారు.

 

అయితే ప్రభుత్వం మాత్రం పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడంలో ఎలాంటి ఆలస్యం చేయడం లేదు. కానీ అమరావతి పరిధిలో ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే, జీతాలు వెంటనే ఇవ్వాలి అనే డిమాండ్ అందరూ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ లోకేష్ ప్రత్యేకంగా అమరావతిపైనే శ్రద్ధ పెట్టి లేఖలు రాయడం బట్టి చూస్తుంటే, అమరావతి కోసం సైలెంట్ గా పోరాడుతున్నట్లే కనబడుతుంది. మరి లోకేష్ లేఖని బొత్స గుర్తిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: