బ్యాంకింగ్ రంగ దిగ్గ‌జం ఎస్‌బీఐ ఒకే రోజు ఓ గుడ్ న్యూస్‌..ఓ బ్యాడ్ న్యూస్ తెలిపింది. అన్ని రకాల రుణాలపై బెంచ్‌మార్క్‌ వడ్డీ రేటును 15 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం 7.40 శాతంగా ఉన్న ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు) తాజా సవరణతో 7.25 శాతానికి తగ్గిందని, ఇది ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అయితే, ఇదే స‌మ‌యంలో హోంలోన్‌ వినియోగదారులకు ఎస్‌బీఐ షాక్‌ ఇచ్చింది. హోం లోన్‌ పై ఉన్న రిస్క్‌ ప్రీమియంను పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది.

 

దేశంలోనే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉన్న ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయాల‌తో పెద్ద ఎత్తున వినియోగదారులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఎస్బీఐ తమ ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ఇది వరుసగా 12వసారి. ఈ సవరణతో ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమైన గృహరుణాల వడ్డీ రేట్లతోపాటు నెలవారీ ఈఎంఐ కూడా తగ్గుతుంది. 30 ఏండ్ల కాలపరిమితితో రూ.25 లక్షల రుణం తీసుకొన్నవారికి ఈఎంఐ రూ.225 తగ్గుతుందని ఎస్బీఐ వివరించింది. అయితే మూడేళ్ల‌ వరకు కాలపరిమితి గల రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నామని, ఇది ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ పేర్కొంది.

 


ఇదే స‌మ‌యంలో ఎస్బీఐ రెపోరేట్‌ ఆధారిత గృహరుణాల వడ్డీరేట్లను 30 బేసిస్‌ పాయింట్లు పెంచింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రుణగ్రహీతలకు, రియాల్టీ సంస్థలకు రుణ సమస్యలు పెరుగవచ్చన్న మార్కెట్‌ నుంచి సంకేతాలు వస్తున్న తరుణంలో ఈ చర్య చేపట్టినట్టు ఆ బ్యాంకు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు ఆస్థి తనఖాపై ఇచ్చే వ్యక్తిగత రుణాల వడ్డీరేట్లను కూడా 30 బేసిస్‌ పాయింట్లు పెంచినట్టు ఎస్బీఐ ప్రకటించింది. దీంతో ఇతర బ్యాంకులు కూడా ఎస్బీఐ బాటలో నడిచే అవకాశముంది. ఎస్బీఐ ఎక్కువ గృహరుణాలను రెపోరేట్‌ లేదా ఎంసీఎల్‌ఆర్‌ ఆధారంగా ఇస్తోంది. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారిత వడ్డీరేటును 7.05 శాతం వద్ద స్థిరంగా ఉంచినప్పటికీ వివిధ రకాల గృహరుణాలపై వడ్డీరేట్లను 30 బేసిస్‌ పాయింట్లు పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: