ఏపీ సీఎం జగన్ కరోనా పరీక్షల విషయంలో పట్టుదలగా ఉన్నారు. కరోనా మహమ్మారిని పారద్రోలాలంటే.. కరోనా వచ్చిన వారిని గుర్తించడంలో ఎలాంటి లోపాలు జరగకూడదన్నది ఆయన అభిమతం. అందుకే ఏపీలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా టెస్టులు నిర్వహిస్తున్నారు. పక్కన ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ సర్కారుపై ఇవే విమర్శలు చేస్తున్నారు. టెస్టులు ఎక్కువగా చేయకపోవడం వల్లే తెలంగాణలో తక్కువ కరోనా కేసులు వస్తున్నాయని చెబుతున్నారు.

 

 

ఏపీలో జగన్ మాత్రం కరోనా పరీక్షల విషయంలో సంతృప్తి చెందడం లేదు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని మరింత పెంచాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో7,320 శాంపిళ్లను పరీక్షించారు. 54 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,887 నమోదు అయ్యింది. వారిలో ఇప్పటివరకు 842 మంది డిశ్చార్జ్ అయ్యారు.

 

 

కరోనా టెస్టుల విషయంలో ఏపీ సర్కారు ముందు నుంచే కాస్త జాగ్రత్తగా ఉంది. కొరియా నుంచి లక్షల సంఖ్యలోటెస్టింగ్ కిట్లు తెప్పించుకుంది. భారీగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇక ఏపీలో కరోనా లెక్కల విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటివరకూ 41 మంది మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,004గా ఉంది.

 

 

రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 16, చిత్తూరులో 3, గుంటూరులో 1, కృష్ణాలో 6, కర్నూలులో 7, విశాఖపట్నంలో 11, విజయ నగరంలో 1 కేసు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరిలో 9 కేసులు నమోదయ్యాయి. కరోనా రోగులకు అందుతున్న సేవలు, వలస కూలీల తరలింపు, క్వారంటైన్‌ సెంటర్లలో వసతులపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. టెస్టులు పెంచడం ద్వారా కరోనాను మరింత కచ్చితంగా అంచనా వేయవచ్చన్నది జగన్ అభిమతంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: