కరోనాతో కలసి కాపురం చేయడమేంటి. పిచ్చి కాకపోతేనూ, కారోనా దేశం పొలిమేరలు దాటి పోవాలి. అపుడే జనం కాలు బయట పెట్టాలి. ఇది మారి లో జనతా కర్ఫ్యూ సమయంలో అందరి మాట. నిజంగా చెప్పాలంటే పాలకులు కూడా ఆ విధంగా జనాలకు చెప్పారనుకోవాలి. అందరూ ఇంట్లో ఉంటే కరోనా కట్టడి అవుతుంది. అపుడు మళ్ళీ సాధారణ జీవితంలోకి వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పుకొచ్చారు.

 

కానీ వాస్తవంలో జరుగుతున్న‌దేంటి అని చూసుకుంటే కరోనా అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే  కరోనా మహమ్మారి రోజు రోజుకూ ఈ దేశంలో పెరుగుతోంది. ఇప్పటికి అరవై వేల వరకూ దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఉన్నాయి. మే ముగిసేనాటికి లక్ష కేసులకు చేరుకోవచ్చు. ఇక జూలై నాటికి కరోనా కేసులు గరిష్టంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంచనా వేస్తోంది. 

 

అంటే అవి లక్షన్నర అవుతాయో, రెండు లక్షలకు చేరుకుంటాయో కూడా ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఇక కరోనా ఇప్పట్లో పోదు, పోవడమేంటి తగ్గదు అని కూడా పాలకులతో పాటు సామాన్యులలో కూడా భావన నెమ్మదిగా  బలపడుతోంది. నిజానికి కరోనా కట్టడి అంత సులువు కాదని ఏలిన వారికి ముందే తెలుసు. కానీ కొంత అయినా అదుపు లో ఉంటుందని లాక్ డౌన్ ప్రకటించారు.

 

ఇక జనాలను ఇంట్లో కూర్చోబెట్టడానికి కరోనా అంతం మన పంతం అని అందమైన నినాదాలు ఇచ్చిన వారూ ఉన్నారు. ఇపుడు ఎవరూ చెప్పకపోయినా పరిస్థితి అందరికీ అర్ధమవుతోంది. ఇక ముఖ్యమంత్రి జగన్  ఈ మధ్యనే కరోనాతో కలసి కాపురం చేయాలంటే అందరూ  విరగ‌బడి నవ్వారు. సోషల్ మీడియాలో ఒక్క లెక్కన జగన్ని ట్రోల్ చేశారు. ఆ తరువాత ఇదే మాట కేసీయార్ చెప్పేసరికి అంతా సైలెంట్ అయ్యారు. ఇపుడు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ కూడా ఇదే మాట చెబుతున్నారు. కరోనాతో కాపురమేనని ఆయన క్లారిటీగా తేల్చేశారు. 

 

అయితే ఏపీలో ఇప్పటికే జనం కరోనాతో కలసి అడుగులు వేస్తున్నారు. మునుపటి భయాలు వారిలో కనిపించడంలేదు. విశాఖ లాంటి మెగా సిటీలో చూసుకుంటే కరోనా అంతకంతకు కరోనా కేసులు ఓ వైపు పెరుగుతున్నా జనం వాటిని అసలు పట్టించుకోవడంలేదు. కరోనా మహమ్మారి ఊసే తలవ‌కుండా తమ దైనందిన వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. ఓ విధంగా ఇది కరోనా విషయంలో వచ్చిన చైతన్యం అనుకోవాలా. లేక జనం బతుకు కోసం ముందుకు వేస్తున్న అడుగులు అనుకోవాలో తెలియదు కానీ కరోనాతో కలసి ప్రయాణం మొదలైంది.

 

మరి ఈ ప్రయాణంలో కరోనాని నియంత్రించి తమ జీవితాన్ని పరుగులు తీయిస్తే ఫరవాలేదు. కానీ ఏ ఉపాయం లేకుండా కరోనాకు ఎదురువెళ్తే మాత్రం ఆ మహమ్మారికి బలమిచ్చి గెలిపించినట్లే. తగిన జాగ్రత్తలు తీసుకుని జనం ముందుకు సాగాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్న మాటలు ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: