రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మాస్క్ లేని వారికి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని... లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రెస్ మీట్లో సూచించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు పక్కాగా అమలు జరిగేలా చర్యలు చేపడుతున్నారు. 
 
అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాస్క్ లేని వ్యక్తికి మద్యం అమ్మినందుకు 5,000 రూపాయల జరిమానా విధించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మాస్క్ ధరించిన వారికే మద్యం విక్రయించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీసులు మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి 1000 రూపాయలు ఫైన్ వేశారు. చెన్నూరు నియోనకవర్గంలో మాస్కులు లేకుండా కూరగాయలు విక్రయిస్తున్న వారికి పోలీసులు 500 రూపాయలు ఫైన్ వేశారు. 
 
అయితే కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామం మద్యం అమ్మకాలను నిషేధించి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. కరీంనగర్ జిల్లాలోని కాట్రవల్లి గ్రామం మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించడం గమనార్హం. గ్రామ పెద్దలు మద్యం దుకాణాలు తెరవకూడదని ఆదేశించడంతో గ్రామంలో మద్యం అమ్మకాలు ఆగిపోయాయి. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మితే పది వేల రూపాయల జరిమానాతో పాటు సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని గ్రామ పెద్దలు హెచ్చరించారు. 
 
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో నిన్న 10 కేసులు నమోదు కాగా కరోనా బాధితుల సంఖ్య 1132కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 29 మంది మృతి చెందారు. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతూ ఉండటం గమనార్హం. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: