అయోధ్య‌లో రామ‌మందిరం విష‌యంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయోధ్య వివాదం ఓ కొలిక్కి రావ‌డం, రామ మందిరం నిర్మాణానికి గ్రీన్ సిగ్న‌ల్ వెలువ‌డటం, అనంత‌రం బోర్డు ఏర్పాటు చేయ‌డం తెలిసిన సంగ‌తే. అయోధ్యలో రామమందిరం నిర్మించేందుకు 15 మంది సభ్యులతో ట్రస్టు బోర్డును ఏర్పాటు చేశారు. నిత్య గోపాల్ దాస్ ఈ ట్రస్ట్ బోర్డుకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటికే రామమందిరం డిజైన్ లోగోను విడుదల చేశారు. రామాలయ నిర్మాణానికి చందాలు ఇవ్వాలంటూ ట్రస్ట్ సభ్యులు కోరుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు విరాళాలు ప్రకటించాయి. అయితే, కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అయోధ్యలో నిర్మించనున్న రామమందిరానికి విరాళాలు ఇచ్చే వారికి పన్ను రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

 


రామమందిరం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టుకు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80 జి కింద ఇన్ కం ట్యాక్స్ రాయితీ ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు ఇస్తామని సీబీడీటీ తెలిపింది. దీని ద్వారా రామమందిరం నిర్మాణానికి ఎక్కువగా విరాళాలు వస్తాయని అంచనా వేశారు. 

 


కాగా, రామ జన్మభూమిలో గుడి కట్టేందుకు విశ్వహిందూ పరిషత్(వీహెచ్​పీ) ముప్పై ఏళ్ల క్రితమే నమూనా సిద్ధం చేసింది. పలు సందర్భాలలో ఈ మోడల్​ను వివిధ వేదికలపై ప్రదర్శించింది. ఎప్పటికైనా ఈ మోడల్​ ప్రకారమే గుడి నిర్మాణం జరుగుతుందని చెబుతూ వస్తోంది. టెంపుల్​ ట్రస్ట్​ ఏర్పాటయ్యాక కూడా ఈ మోడల్​లోనే గుడి కడతారని ఆశిస్తున్నట్లు వీహెచ్​పీ పేర్కొంది. ఇదే విషయాన్ని ట్రస్టు సభ్యుడు స్వామి గోవింద్​ దేవ్​ గిరి కూడా స్పష్టంచేశారు. వీహెచ్​పీ మోడల్​ ప్రకారమే గుడి నిర్మాణం జరుగుతుందని, అయితే, కొన్ని మార్పులు చేయాలని ట్రస్టు నిర్ణయించిందని చెప్పారు. కాగా, అయోధ్యలో కట్టబోయే రామ మందిరం ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ పటేల్​ అన్నారు. టూరిస్టులను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ డెవలప్​మెంట్​కు తోడ్పడుతుందని చెప్పారు. గుడి నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసేందుకు కేంద్రంతో పాటు యూపీ సర్కారు కూడా కట్టుబడి ఉందన్నారు. 5 ట్రిలియన్​ అమెరికన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకోవడానికి టూరిస్ట్  గైడ్స్​లకు ట్రైనింగ్​ ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: