దేశమంతా వైన్ షాపులకు అనుమతులిస్తే, కర్ణాటక ప్రభుత్వం రెస్టారెంట్లు బార్లు, క్లబ్బులకు కూడా పచ్చజెండా ఊపింది. అయితే సిట్టింగ్‌ కు మాత్రం అనుమతి ఇవ్వలేదు. కేవలం టేకెవే సౌకర్యాన్ని మాత్రమే కల్పించింది. లాక్ డౌన్ కారణంగా పేరుకుపోయిన స్టాక్‌ క్లియర్ చేసుకోవడానికి వైన్ షాపుల తరహాలోనే క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లకు అనుమతినిచ్చింది.

 

సడలింపులతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. నెలన్నర రోజుల తర్వాత వైన్ షాపులు తెరచుకోవడంతో మందుబాబుల సందడి నెలకొంది. ఎక్కడ చూసినా భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో మద్యం లాగించేస్తున్నారు. అయితే ఏ రాష్ట్రంలో కూడా బార్లు, క్లబ్బులు, పబ్బులకు మాత్రం అనుమతి లేదు. భౌతిక దూరం పాటించాలన్న ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాలు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే అమ్ముతున్నాయి. అయితే కర్నాటక ప్రభుత్వ మాత్రం క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతిచ్చింది.

 

తాజా ఉత్తర్వుల ప్రకారం నేటి నుంచి మే 17 వరకు బార్లు, క్లబ్బులు కూడా ఎమ్ ఆర్ పీ  ధరలకు మద్యం విక్రయాలు జరుపుకోవచ్చు. అయితే కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు తప్పక పాటించాలి. ఉల్లంఘించిన వారి దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు తెలిపారు.

 

ఆరు నెలల షెల్ఫ్ లైఫ్ ఉన్న బీర్ లాంటివి సరైన సమయంలో విక్రయించకపోతే ఆ స్టాక్ పనికిరాకుండా పోతుందని బార్ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 వరకు  మద్యం విక్రయించడానికి అనుమతినిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

 

కాగా కర్నాటక వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం... రాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 753కు చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 376 మంది కోలుకోగా.. 30 మంది మరణించారు. కర్నాటకలో ప్రస్తుతం 347 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

 

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 2020, మార్చి 24వ తేదీ నుంచి దేశం లాక్ డౌన్ లో ఉంది. మే 17వరకు ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయితే లాక్ డౌన్ త్రీలో భాగంగా, మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: