మద్య నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఈ నెలాఖరుకు మరో 13 శాతం మద్యం షాపులు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇరవై శాతం వైన్ షాపులను రద్దు చేసిన జగన్ ప్రభుత్వం  తాజా నిర్ణయంతో దాన్ని 33 శాతానికి చేర్చింది.

 

వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఏపీలో 4వేల 380 మద్యం షాపులు ఉండగా గతేడాది వాటిని 3,500కు కుదించింది. మొత్తం షాపుల్లో రద్దైన షాపుల శాతం 20 .  ఇప్పుడు నెలాఖరుకల్లా మరో 13 శాతం షాపులు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే వచ్చే నెల నుంచి ఏపీలో 2934 మద్యం షాపులు మాత్రమే ఉంటాయి. 840 బార్లలో 40 శాతం తగ్గించి... 530 బార్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి రెండు రోజుల వ్యవధిలో 75 శాతం చొప్పున రేట్లు పెంచిన ప్రభుత్వం.. షాపుల సంఖ్య కూడా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు 5వందలకు పైగా షాపులు తగ్గే అవకాశం ఉంది. 

 

అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్.. అందుకు కార్యాచరణ ప్రకటించారు. మద్యం షాపులను ప్రభుత్వ ఆధీనంలో నడపడం, అదీ నిర్ణీత సమయంలోనే ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఏపీ వైన్ షాపుల్లో విక్రయాలు జరుగుతున్నాయి. 

 

మద్యం విక్రయానికి పరిమితి కూడా విధించింది ప్రభుత్వం. ఒక్కో వ్యక్తికి నిర్ణీత సంఖ్యలోనే మద్యం సీసాలు విక్రయిస్తున్నారు. ఈ చర్యల కారణంగా మద్యం అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి.  గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 24 శాతం లిక్కర్, 55 శాతం బీర్ విక్రయాలు తగ్గాయి. 

 

లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వం తిరిగి మద్యం షాపులను తెరవడం విమర్శలకు దారి తీసింది. మద్యపానాన్ని నిరుత్సాహ పరచే ఉద్దేశంతో ఒకసారి ధరలు పెంచిన ప్రభుత్వం ఈ నెల 4న మరోసారి 25 శాతం ధరలు పెంచింది. ఆ మర్నాడే మరో 50 శాతం ధరలు పెంచేసింది. ధరలు పెంచడం ద్వారా మద్యం సీసాను ముట్టుకుంటేనే షాక్ కొట్టాలన్నది తమ విధానమని... అందులో ఆదాయ ఆర్జన ప్రశ్నేలేదని ప్రభుత్వం కొట్టిపారేసింది. 

 

దీనికి తగ్గట్టుగానే మొదటి రోజు 91 కోట్ల రూపాయల మేర జరిగిన మద్యం అమ్మకాలు.... రెండో రోజున అంటే ధరలు 75 శాతానికి చేరిన తర్వాత 48 కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఆ తర్వాత గత మూడు రోజుల్లో వరుసగా... 57 కోట్లు, 43 కోట్లు, 42 కోట్ల రూపాయల అమ్మకాలు మాత్రమే జరిగాయి. 

 

వాస్తవంగా ఏడాదికి 20 శాతం చొప్పున మద్యం షాపులను తగ్గిస్తూ 2024 నాటికి షాపుల సంఖ్యను జీరో చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఆ తర్వాత నుంచి కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలోనే మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: