మహమ్మారి కరోనా పెరగటమే తప్ప తగ్గటం లేదు. తగ్గుముఖం పడుతున్నట్టే పట్టి మళ్లీ మానవాళి మీద విరుచుకు పడుతోంది. అగ్రరాజ్యం అమెరికా సహా అనేక దేశాలు గజగజలాడుతున్నాయి. కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్నా కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లోనూ రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయ్‌. తెలుగు రాష్ట్రాల్లో కూడా మాయాదారి వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది.

 

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎంత కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా... కరోనా మాత్రం వెనక్కు తగ్గటం లేదు. శరవేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో రెండు లక్షల 76 వేల మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షల 33 వేలు దాటింది. ఈ వైరస్ నుంచి 14 లక్షల మంది  కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణికిస్తోంది. 78 వేల మందికి పైగా వైరస్‌కు బలయ్యారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య 13 లక్షల 22 వేలకు చేరింది. ట్రంప్‌ కుమార్తె ట్రంప్‌ ఇవాంక పర్సనల్ సెక్రటరీకి కరోనా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో శ్వేతసౌధంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య మూడుకు చేరింది. 

 

యూరప్‌ దేశాల్లో వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. స్పెయిన్‌, ఇటలీల్లో సెకండ్‌ వేవ్‌ మొదలైంది. బ్రిటన్‌లో మరణాల సంఖ్య 31 వేలు దాటింది. ఇటలీలో సుమారు 30 వేల మంది చనిపోయారు. రష్యా, బ్రెజిల్‌ దేశాలు కరోనాకు న్యూ హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయ్‌. 

 

భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. మహరాష్ట్ర, గుజరాత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గడచిన 24 గంటల్లో  దేశవ్యాప్తంగా కొత్తగా 3 వేల 320 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయ్‌. మరో 95 మందిని వైరస్‌ పొట్టనబెట్టుకుంది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 59 వేల 662కు చేరుకుంది. 19 వందల 81 మంది కరోనా కాటుకు బలయ్యారు.  దేశంలో కరోనా రికవరీ రేటు 29.91 శాతంగా ఉంది. 

 

ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19 వందల 30కి చేరింది. గత 24 గంటల్లో 8 వేల 338మంది శాంపిల్స్‌ పరీక్షించగా.. అందులో కొత్తగా 43 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా కృష్ణా జిల్లాలో 16, చిత్తూరు జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయ్‌. కరోనాతో ఇవాళ మరో ముగ్గురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 44కు చేరింది. ఏపీలో కరోనా పాజిటివ్‌ రేటు కూడా 1.17 శాతానికి తగ్గింది.

 

మరోవైపు కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఏపీ ప్రథమస్థానంలో ఉందని, ఏపీలో ప్రతి మిలియన్ జనాభాకు 3 వేల 91 పరీక్షలు  నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి ఏపీకి వచ్చినవారిపై దృష్టిపెట్టామన్న ఆయన.. కరోనా మరణాలు లేకుండా మంచి వైద్యం అందించడంపై దృష్టిపెట్టాలని వైద్య సిబ్బందికి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: