2019 ఎన్నికల్లో టీడీపీ ఎంతటి ఘోర పరాజయం పాలైందో తెలిసిందే. 175 సీట్లకు గాను ఆ పార్టీ కేవలం 23 సీట్లు మాత్రం దక్కించుకుని, ఎలాగోలా ప్రతిపక్ష స్థానం దక్కించుకుని పరువు దక్కించుకుంది. అయితే రాను రాను ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా గల్లంతయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. చంద్రబాబు రాజకీయ జీవితంలో తొలిసారి ప్రతిపక్ష నాయకుడు హోదా పోగొట్టుకునే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది.

 

మామూలుగా ప్రతిపక్ష హోదా ఉండాలంటే మొత్తం ఉన్న సీట్లలో 10 శాతం సీట్లు ఉండాలి. అంటే ఏపీలో 175 సీట్లు ఉన్నాయి కాబట్టి 17 -18 సీట్లు ఉండాలి. టీడీపీ ఎలాగో 23 గెలిచింది కాబట్టి ప్రతిపక్ష హోదా ఉంది. అయితే తమ పార్టీలోకి వచ్చేవారు పదవికి, పార్టీకి రాజీనామా చేసి రావాలని రూల్ పెట్టడంతో, టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావడానికి ఆసక్తి చూపించలేదు. కానీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడి, వైసీపీలో చేరకుండా జగన్ కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించి, అప్పటి నుంచి ఆ పార్టీ అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు.

 

ఇక వంశీ బాటలోనే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా జగన్ కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా జగన్ కు జై కొట్టారు. ఈ ముగ్గురు ఇలా టీడీపీని వీడటంతో ఆ పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. అయితే తాజాగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుందని అన్నారు.

 

అంటే రాబోయే రోజుల్లో మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు బయటకొస్తున్నట్లు కొడాలి హింట్ ఇచ్చారు. ఇక కొడాలి మాటలకు తగ్గట్టుగానే కొంతమంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు(కలవపూడి రాంబాబు)లు టీడీపీని వీడనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక వీరితో పాటు మరికొందరు కూడా అటుఇటు ఊగిసలాడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే త్వరలోనే బాబు ప్రతిపక్ష హోదాకు ఎర్త్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: