తెలంగాణాలో  కరోనా పరీక్షలు సరిగ్గా నిర్వహించడం లేదని విపక్షాల చేస్తోన్న  ఆరోపణలకు హైకోర్టు వ్యాఖ్యలు మరింత  బలాన్ని చేకూర్చినట్లయింది . రాష్ర్టంలో కరోనాపరీక్షలు  ఎందుకు సరిగ్గా నిర్వహించడం లేదని  రాష్ట్రప్రభుత్వాన్ని  హైకోర్టు  నేరుగా  ప్రశ్నించడం ... గత నెలరోజులుగా  టిఆరెస్ సర్కార్ పై విపక్షాలు చేస్తోన్న  ఆరోపణల్లో  ఎంతోకొంత నిజం  లేకపోలేదన్న  నిర్ధారణ కు సామాన్యులు వచ్చేలా చేసింది . రాష్త్రం లో  కరోనాపరీక్షలు సరిగ్గా  నిర్వహించకపోగా , కేసుల సంఖ్యను తక్కువ చేసి  చూపుతున్నారని  బిజెపి రాష్ట్ర నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు .

 

అయితే బిజెపి తోపాటు , కాంగ్రెస్ ఇతర విపక్షాలు  చేస్తోన్న  ఆరోపణలపై టిఆరెస్ నాయకత్వం , ముఖ్యమంత్రి  కెసిఆర్ ఎదురుదాడి చేశారు . విపక్ష నేతలనుద్దేశించి  జోకర్లు , బఫున్లు అంటూ ముఖ్యమంత్రి  విమర్శలు చేయగా ఆయన మంత్రివర్గ సహచరులు సైతం అదే తరహా  విమర్శలకు తెగబడ్డారు . ఇప్పుడు హైకోర్టు సైతం  రాష్ర్టంలో కరోనాపరీక్షలు నిర్వహించటం లేదని , కేసులు తక్కువ చేసి  ఎందుకు చూపిస్తున్నారని  ప్రశ్నించిందని ,  ముఖ్యమంత్రి , మంత్రులు హైకోర్టు పై ఎదురుదాడి    చేస్తారా ? అంటూ బిజెపి సీనియర్ నేత , ఎమ్మెల్సీ  రామచందర్ రావు ప్రశ్నించారు . విపక్షాలు నిజాలు చెబితే  జీర్ణించుకోలేని ప్రభుత్వ పెద్దలు ,  హైకోర్టు అంక్షింతలతోనైనా మేల్కొని రాష్ర్టంలో  కరోనా టెస్టులు ఎక్కువగా నిర్వహించాలని  డిమాండ్ చేశారు . 

 

రాష్ట్రం లో కరోనా టెస్టుల నిర్వహణ పై ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కూడా తప్పుదోవ పట్టించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు . ఈ మేరకు కేంద్ర హోంశాఖ  ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ , రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వ బృందాన్ని పంపించాలని కోరారు . అయితే రాష్ట్రం లో కరోనా టెస్టులు తక్కువగా నిర్వహిస్తున్నట్లు విపక్షాలు చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు . అయితే విపక్షాల ఆరోపణల్ని  బలపర్చేవిధంగా , ఇప్పుడు హైకోర్టు కూడా వ్యాఖ్యలు చేయడం అధికార పార్టీని ఇరకాటంలో పడేసింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: