చికెన్, మటన్ వ్యాపారులకు తెలంగాణ సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా అధిక ధరలకు మాంసం విక్రయించినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. కేజీ మటన్ 700 రూపాయలకు విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. చికెన్, గుడ్ల ధరలు nec సూచించిన మేరకు ఉండాలని పేర్కొంది. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే షాపులకు జరిమానాలు, సీజ్ లు తప్పవని పేర్కొంది. 
 
చికెన్, మటన్ వ్యాపారుల దగ్గర వినియోగదారులు బిల్లులు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. పరిశుభ్రత లేకపోయినా, తూకంలో తేడాలున్నా, అధిక ధరలకు విక్రయించినా 9848747788 నంబర్ కు ఫోన్ చేయలని అధికారులు సూచించారు. రాష్ట ప్రభుత్వానికి గత కొన్నిరోజుల నుంచి చికెన్, మటన్ అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 
 
నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తీసుకుంటున్నారు. దుకాణాల దగ్గర లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గత కొంత కాలంగా తక్కువ కేసులు నమోదవుతున్నా నిన్న వైరస్ మరోసారి విజృంభించింది. రాష్ట్రంలో నిన్న 31 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1163కు చేరింది. 
 
నిన్న ఒకరు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 30కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 382 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 9 జిల్లాలు గ్రీన్ జోన్ల పరిధిలో ఉండగా మరో 14 జిల్లాలు చేరే అవకాశం ఉంది. రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మాత్రం రెడ్ జోన్లుగా ఉంటాయని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటన విడుదల చేశారు.                                     
 

మరింత సమాచారం తెలుసుకోండి: