ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎక్కువ సంఖ్యలో మహిళా నేతలు కనిపిస్తూ ఉండేవారు. అలాగే వారికి ప్రాధాన్యత కూడా ఎక్కువ ఉండేది. అయితే రాను రాను టీడీపీలో మహిళా నేతల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే వారికి పార్టీలో కూడా పెద్దగా ప్రాధాన్యత కూడా ఉన్నట్లు లేదు. ఇక ఉన్నవాళ్ళ మధ్యలో కోల్డ్ వార్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

 

ఆ కోల్డ్ వార్ కు తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి కారణమైనట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారం కోల్పోయాక చాలామంది మహిళా నేతలు సైలెంట్ అయిపోయారు. ఏదో నలుగురైదుగురు తప్ప, మిగతా వారు యాక్టివ్ గా కనబడటం లేదు. ముఖ్యంగా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ బాగా యాక్టివ్ గా ఉంటూ, అధికార వైసీపీపై పోరాటం చేస్తున్నారు. పైగా గతంలో ఎమ్మెల్సీ పదవి కూడా వచ్చినట్లు వచ్చి చేజారింది. 

 

దీంతో మహిళా అధ్యక్షురాలు పదవి ఈమెకే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు, బాబు పదవి కట్టబెట్టారు. ఇక అక్కడ నుంచి అనురాధ కాస్త తగ్గిపోయారు. ఇదే సమయంలో అనిత ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టడం, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం చేస్తున్నారు. ఇలా అనిత డామినేషన్ పెరగడంతో అనురాధ అసంతృప్తితో ఉన్నారని, అందుకే దూకుడు కూడా  తగ్గించారని తెలుస్తోంది.

 

అసలు టీడీపీలో తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి అంటే చాలా విలువ ఉండేది. ఆ పదవి ద్వారా రాష్ట్రంలో మహిళలకు కష్టాలు ఉంటే తెలుసుకుని, వారికి అండగా ఉండే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు అలా ఏమి లేదు. కేవలం జగన్ ప్రభుత్వాన్ని తిట్టడానికే అనిత పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈమె మహిళల సమస్యలపై పోరాటం చేసి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం కూడా చేయడం లేదు. మొత్తానికైతే పదవి వచ్చాక అనిత బాగా హడావిడి చేస్తున్నట్లే కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: