ప్రస్తుతం ఏపీ రాజకీయాలు విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఘటన ఉదాహరణ అని, కోటి రూపాయలు సాయం చేస్తే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? అని చెప్పి టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఎల్జీ పాలిమర్స్ కంపెనీతో జగన్ ప్రభుత్వం లాలూచీ పడిందని, తక్షణమే కంపెనీ మూసేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో గతంలో ఈ కంపెనీకి టీడీపీనే అనుమతి ఇచ్చిందని, ఈ పాపానికి చంద్రబాబే కారణమని వైసీపీ ఆరోపిస్తుంది.

 

అయితే వీరి ఆరోపణల ఎలా ఉన్నా జగన్ చేసిన సాయం మాత్రం దేశంలో ఎవరు చేయలేదు. ఆయన ఘటనపై వెంటనే స్పందించి, బాధితులకు ఊహించని సాయం చేయడంపై అన్ని వైపులా నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కాకపోతే ఈ సాయాన్ని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక ఈ సాయంపై ఇంకో వివాదం ఒకటి వచ్చి పడింది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ మూసేయాలని బాధితులు ధర్నా చేస్తున్న సమయంలో, అక్కడకు వెళ్లిన మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

 

బాధితుల్ని అక్కడ నుంచి వెళిపోవాలనే చెప్పే క్రమంలో అసలు 20 లక్షలు సాయం చేయడమే ఎక్కువని, కానీ జగన్ మంచి మనసుతో కోటి రూపాయలు చేసారని, మిగిలిన సమస్యలు కూడా త్వరగా పరిష్కరిస్తామని కాబట్టి అక్కడ నుంచి ప్రజలు తరలి వెళ్లాలని మంత్రి కోరారు. ఇక ఈ వ్యాఖ్యలపై బాధితులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కోటి ఇస్తే మనిషి ప్రాణాలు తిరిగొస్తాయా? అని కొందరు ప్రశ్నించారు.

 

ఇక అవంతి ఒక దద్దమ్మ..అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన నాలుక కోయాలని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అవంతిని గెలిపించినందుకు విశాఖ సిగ్గుపడుతోందని, అవంతికి మంత్రి పదవికి ఇచ్చినందుకు జగన్‌ తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే జగన్ సాయంపై ఎంతలా ప్రశంసలు వస్తున్నాయో, అవంతి వ్యాఖ్యలపై అంతేస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరి అవంతి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: