కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని ఆశలు చిగురించడంతో.. ఐసీఎంఆర్ ఈ విధానానికి అనుమతిచ్చింది. తెలంగాణలో దీంతో రేపటి నుంచి గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా చికిత్స కు బీజం పడనుంది. ఇప్పటికే 15 మంది దాతలు ప్లాస్మా దానానికి ముందుకొచ్చారు. 

 

తెలంగాణలో సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో 15 మంది ప్లాస్మా దానం చేసేందుకు ఇప్పటికే ముందుకు వచ్చారు. ఈ 15 మంది కూడా మొదట్లో కరోనా సోకిన 15 మంది విదేశీయులే. ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కరోనా నుంచి కోలుకున్న 200 మంది గతంలోనే గాంధీ వైద్యులకు సంసిద్ధత తెలిపారు.

 

ప్లాస్మా దానానికి ముందుకొచ్చిన 15 మంది నుంచి సోమవారం వైద్యులు రక్తం సేకరించనున్నారు. ఒక్కొక్కరి నుంచి 400 మిల్లీ లీటర్ల రక్తం సేకరిస్తారు. ఒక్కొక్కరి రక్తం నుంచి ప్లాస్మా వేరు చేసేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టే అవకాశముంది.

 

ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం ప్లాస్మాథెరపీ తీసుకునేందుకు అర్హులైన కరోనా బాధితులు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఐదుగురు మాత్రమే ఉన్నారు. ప్లాస్మా సేకరించిన తరువాత గ్రహీత రక్తం మ్యాచ్ చేయడంతో పాటు క్రాస్ మ్యాచ్ చేసిన తరువాతనే రోగికి ప్లాస్మా ఇవ్వనున్నట్టు వైద్యులు వెల్లడించారు.

 

ప్లాస్మా చికిత్సలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ప్లాస్మా చికిత్స జరిగిన తరుణంలో.. అక్కడి అనుభవాల్ని కూడా తీసుకుని ప్రొసీజర్ ఫాలో అవుతామని చెప్పారు. తప్పకుండా ప్లాస్మా థెరపీ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని చెబుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మాథెరపీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాతలు కూడా సిద్ధంగా ఉండటంతో ప్లాస్మా చికిత్సపై అంతా ఆసక్తి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: