దేశ వ్యాప్తంగా మూడో విడత లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో.. ప్రధాని మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు మోడీ సీఎంలతో మాట్లాడతారని పీఎంఓ ట్వీట్ చేసింది. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పెంచాలని ఇప్పటికే రాష్ట్రాల సెక్రటరీలు కేంద్రాన్ని కోరారు. 

 

కరోనా తరుణంలో విధించిన లాక్‌డౌన్‌-3 కొనసాగుతున్న సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎంలతో ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్ అమలుపై చర్చిస్తారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరుపుతారు. ఈ నెల 17న లాక్‌డౌన్ ముగియనున్న తరుణంలో.. మోడీ సీఎంల మీటింగ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. 

 

సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ సీఎంలతో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య శాఖ మంత్రి, వైద్య శాఖ కార్యదర్శి, హోం మంత్రి, హోంశాఖ కార్యదర్శి కూడా హాజరుకానున్నారు. రాష్ట్రాల వారిగా కోవిడ్‌ నివారణకు చేపడుతున్న చర్యలను మోదీ తెలుసుకోనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు, సలహాలు కూడా ఇవ్వనున్నారు. 

 

లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వనరులు పూర్తిగా మూసుకుపోవడంతో.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కోవిడ్ రక్షణ చర్యలు అమలు చేస్తున్నప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలను కూడా క్రమంగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. 

 

మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. కరోనా కట్టడికి వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు.. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. మే 17న లాక్ డౌన్ ముగియనుండటంతో తదుపరి కార్యచరణపై అభిప్రాయాలు అడిగి తెలుసుకోనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: