ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపుల దిశగా ఎన్ని ఆదేశాలు ఇచ్చినా బెజవాడలో మాత్రం అమలు చేయలేని పరిస్థితి. బెజవాడ కరోనా పాజిటివ్ కేసులతో అల్లాడిపోతోంది. జిల్లాలో 339 పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 300 పాజిటివ్ కేసులు బెజవాడలో నమోదయ్యాయి అంటే పరిస్థితి నగరంలో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

కరోనా కేసులకు బెజవాడ నగరం అడ్డాగా మారిపోయింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్యలో కృష్ణా జిల్లా మూడో స్థానంలో ఉంది. ఇందులో ఎక్కువ కేసులు బెజవాడ నగరంలోనే నమోదయ్యాయి. దీంతో బెజవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధి అంతా రెడ్ జోన్ పరిధిలోకి వెళ్ళింది. ప్రధానంగా కృష్ణలంక, కార్మిక నగర్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 

 

42 రోజులపాటు కరోనా లాక్ డౌన్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేశాయి. మూడో లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు అమల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా కొన్ని రంగాల వారు పరిమిత సంఖ్యలో పని వారితో పనులు చేసుకోవచ్చని చెప్పింది. దీంతో బెజవాడలో తమ వ్యాపారాలను మళ్లీ మొదలు పెట్టొచ్చని చాలా మంది భావించారు. కానీ, బెజవాడలో కేసుల తీవ్రత దృష్ట్యా వ్యాపారుల ఆశలు అవిరయ్యాయి. 

 

మరోపక్క రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు బెజవాడలో కూడా  42 రోజుల తర్వాత మద్యం అందుబాటులోకి వస్తుందని భావించారు. అయితే కేసుల తీవ్రత దృష్య్టా బెజవాడలో ఒక్క మద్యం షాప్ కూడా ఓపెన్ అవ్వలేదు. దీంతో బెజవాడ మందు బాబులు జిల్లాలో ఉన్న రూరల్ ప్రాంతాలకు వెళ్లి మందు కొనుగోలు చేసుకున్నారు. 

 

ఇక ఏపీ ప్రభుత్వం తాజాగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెడ్ జోన్, బఫర్ జోన్ కాని ప్రాంతాల్లో కార్యకలాపాలు చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. అయితే నగరమంతా రెడ్ జోన్ కావటంతో ఇక్కడ ఈ వెసులుబాటు అందుబాటులోకి వచ్చే పరిస్థితులు లేవు. దీంతో ఎప్పుడు బెజవాడలో సడలింపులు అమలవుతాయా అని బెజవాడ వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: