కరోనా వైరస్ ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తోంది. మన దేశంలో ఒక్కరోజే 4200 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆంక్షలను సడలిస్తున్న దేశాల్లో వైరస్ వేగంగా విజృంభిస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ ను సడలిస్తున్న దేశాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ఆయా దేశాలకు భారీ షాక్ తగులుతోంది. జనం లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరగడంతో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 
 
జర్మనీ, దక్షిణ కొరియా దేశాలతో పాటు లాక్ డౌన్ నిబంధనలను సడలించిన ఇతర దేశాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దక్షిణ కొరియాను తొలినాళ్లలో కరోనా గజగజా వణికించింది. ప్రభుత్వం పటిష్ఠ ప్రణాళికలను అమలు చేసి కొత్త కేసులు నమోదు కాకుండా కరోనాను నియంత్రించడంలో సఫలమైంది. కానీ తాజాగా ప్రభుత్వం ఆంక్షలను సడలించటంతో నిన్న ఒక్కరోజే 34 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
తాజాగా జర్మనీ దేశంలో 667 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలోని ఒకే ప్రాంతంలో 180 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇటలీలోను లాక్ డౌన్ ను సడలించడంతో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తేలింది. దేశ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతుండటంతో పలు దేశాలు ఆంక్షలు సడలిస్తున్నాయి. రష్యా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. 
 
పాకిస్తాన్ లో ఒక్కరోజే 2870 కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 639కు చేరింది. వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్న ఆఫ్రికాలో 60,000కు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ పుట్టుకకు కేంద్రమైన వుహాన్ లో 36 రోజుల తర్వాత తొలి కేసు నమోదైంది. నగరాల్లో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు సైనిక చట్టాన్ని అమలు చేస్తున్నట్టు చైనా అధికార వర్గాలు చెబుతున్నాయి.        
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: