ఆదాయం నిల్.. ఖర్చులు ఫుల్... దీంతో అప్పులు తప్పటం లేదు. లాక్ డౌన్ తో తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి  భారీగా గండి పడింది. కేంద్రం నుండి కూడా నిధులు రావల్సినంత రావడం లేదు. ఖర్చులు మాత్రం తడిసిమోపెడవుతున్నాయి. దీంతో గత నెలలో రూ.4 వేల కోట్లు అప్పు తెచ్చిన సర్కార్.. ఈ నెలలో రూ.2 వేల కోట్ల బాండ్స్ వేలం పెట్టింది.

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెలలో కూడా ఆర్ధిక ఇబ్బందులు తప్పేలా లేదు. ఏప్రిల్ తో పోల్చుకుంటే మే లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ, అది రాష్ట్ర అవసరాలను తీర్చేంతగా లేదనే చెప్పాలి. లాక్ డౌన్ తో అన్ని మూత పడడంతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఆగిపోయింది. వేల కోట్లలో రావాల్సిన చోట.. వంద కోట్లలో కూడా రాలేదు. కేంద్రం సహాయం కోసం  పదే పదే విజ్ఞప్తి చేసినా స్పందన లేదు.గత నెలలో తెలంగాణ వాటా 14 వందల కోట్లు రావాల్సి ఉంటే 982 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ నెల ఎంత వస్తుందో తెలియదు. 

 

గత నెలలో మద్యం దుకాణాలు మూతపడి ఉండడంతో ఆదాయం రాలేదు. ఈ నెలలో ఎక్సయిజ్, రిజిస్ట్రేషన్స్ ద్వారా కాస్త పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. గత నాలుగు రోజుల్లో 640 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రవాణా, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. అక్కడి నుండి కూడా ఆదాయం ఓ మోస్తరుగా వచ్చే అవకాశం ఉంది. యాక్టివిటీ పెరగడంతో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉంది. 

 

అయితే ప్రభుత్వం రుణమాఫీకి నిధులు విడుదల చేసింది.. రైతు బంధు కూడా ఇస్తానని ప్రకటించింది. రేషన్ కార్డు దారులకు డబ్బులు, పెన్షన్స్ ఇతర సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు అవసరం. దీంతో ప్రభుత్వం ఈ నెలలో రెండు వేల కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. దీనికోసం బాండ్స్ ని వేలానికి పెట్టింది.

 

ప్రభుత్వం నడవాలంటే, రెగ్యులర్ యాక్టీవిటీస్ తో పాటు, జీతాలకు ఇతర ఖర్చులకు డబ్బు కావాలి.. దీంతో ప్రభుత్వం అప్పు చేయాల్సిన పరిస్థితిలో పడింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ లోనే ప్రభుత్వం 4 వేల కోట్లు అప్పు తీసుకుంది. ఈ నెల లో మరో 2 వేల కోట్లు తీసుకోవాలని డిసైడ్ అయింది. సరి పోక పోతే ఈ నెలలోనే మరో వెయ్యో, రెండు వేల కోట్లు అప్పు తీసుకునే అవకాశం కూడా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: