లాక్‌డౌన్‌తో నేరాల సంఖ్య పెరిగే అవకాశం కనపడుతోంది. పాత నేరగాళ్లు తెగబడటంతో పాటు కొత్త నేరగాళ్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు నిపుణులు. ఇందుకు ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులే. లాక్‌డౌన్‌తో ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్స్ జరగకపోవడంతో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. పూట గడవడమే కష్టంగా మారుతున్న తరుణంలో నేరాలు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

 

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ విధించారు. దీంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని ఎన్నో జీవితాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఉపాధి లేక చేతిలో డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే లాక్‌డౌన్‌లో నిరుపేదలకు చేయూతను అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించాయి. కానీ ఇవి కొంతమందికే లబ్ది చేకూరేలా ఉండటంతో ఎంతో మంది నిరుపేద కుటుంబాలు పస్తులుంటున్నాయి. కూలీలు, వలస కార్మికులు, టైర్‌ పంప్చర్‌ చేసే దుకాణాలు, మెకానిక్‌లు.. ఇలాంటి వారు పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్‌ రాష్ట్ర ముఠాలు హైదరాబాద్ లో సంచరిస్తూనే ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు దోచుకోవడానికి సిద్ధంగానే ఉన్నాయి. 

 

లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం ఇటీవల కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలతో పాటు ఐటీ కంపెనీల్లో దాదాపు 33 శాతం మంది ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. మనీ ట్రాన్సాక్షన్స్  లేకపోవడంతో.. ఆర్థికపరమైన  నేరాలు పెరిగే అవకాశాలున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చైన్ స్నాచింగ్ లు, పిక్‌ పాకెటింగ్‌లు పెరిగే అవకాశం ఉంది. ఒంటరిగా నిర్మానుష్యమైన ప్రాంతాల్లోకి వెళ్లొద్దని, తక్కువ దూరం కదా అని అడ్డదారుల్ని ఆశ్రయించొద్దని హితవు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు రహదారులనే వాడాలని, పరిసర ప్రాంతాల్ని జాగ్రత్తగా గమనించాలని సూచిస్తున్నారు ఖాకీలు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఇంటికి వచ్చినా.. మెయిన్‌ డోర్‌ వరకూ రానీయొద్దని, అవసరమైతే గ్రిల్స్‌ను ఏర్పాటు చేసుకొని అక్కడే మాట్లాడాలని చెబుతున్నారు. ఎమర్జెన్సీ నెంబర్‌ డయల్‌ 100కు అపద సమయంలో వెంటనే కాల్ చేయాలని గుర్తుచేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: