లాక్ డౌన్ క‌ష్టాల విష‌యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లాక్ డౌన్ విష‌యంలో అనేక మంది ఉత్కంఠ‌కు త‌న‌దైన సూచ‌న చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం దేశంలోని అందరు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్ల‌తో... రైళ్ల‌లో ప్ర‌యాణం చేయాల‌నుకు‌నే వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్ల‌యింది.

 


ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్రమోదీతో వీడియో కాన్ఫ‌రెన్స్ స‌మావేశం సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  దేశంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ సరైన చర్యలు తీసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. కరోనాపై తప్పక విజయం సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా ప్రభావం దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా బాధితులున్నారు కాబట్టి ఇప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి. ఎవరు ఎటు పోతున్నారో తెలియదు. వారికి కరోనా ఉందో లేదో తెలియదు. అందరికీ టెస్టులు చేయడం కుదరదు. రైళ్లలో వచ్చిన ప్రయాణీకులను క్వారంటైన్ చేయడం కూడా కష్టం. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడపొద్దు.`` అని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. కరోనా వల్ల ఆర్థిక ప‌రిస్థితులు తీవ్రంగా ప్రభావితం అయ్యాయ‌ని తెలిపారు. ``ఆదాయాలు లేవు. అప్పులు కట్టే పరిస్థితి ఏ రాష్ట్రానికీ లేదు. కాబట్టి అన్ని రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలి. రైతుల రుణాలను ఎలాగైతే బ్యాంకులు రీ షెడ్యూల్ చేస్తాయో అలాగే రాష్ట్రాల రుణాలను రీ షెడ్యూల్ చేసే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలి.`` అని వెల్ల‌డించారు. 

 

ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల విషయంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క ప్ర‌తిపాద‌నలు చేశారు. ``పాజిటివ్/యాక్టివ్ కేసులు లేని జిల్లాలను ఆరెంజ్/గ్రీన్ జోన్లుగా మార్చమని కేంద్రాన్ని కోరుతున్నాం. అలా ప్రకటించడంలో జాప్యం జరుగుతుంది. పాజిటివ్ కేసులు లేని ప్రాంతాల్లో ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి రాగానే జాప్యం లేకుండా జోన్ల మార్పు జరగాలి.  `` అని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: