క‌రోనా క‌ల‌కలం నేప‌థ్యంలో అంత‌ర్జాతీయంగా దోషిగా ముద్ర ప‌డిన చైనా ఇప్పుడు కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తోందా? భార‌త‌దేశాన్ని నేరుగా టార్గెట్ చేయ‌లేక ప‌క్క‌లో బ‌ల్లెంలా మ‌రో రూపంలో టార్గెట్ చేస్తోంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. చైనా సరిహద్దుల్లోని లిపులేఖ్ ప్రాంతంలో భారత్ రోడ్డు నిర్మాణం జరపడం పట్ల నేపాల్ అభ్యంతరం తెలిపిన నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. భార‌త్‌ను ఇర‌కాటంలో ప‌డేసేందుకు ఈ ఎత్తుగ‌డ అని మండిప‌డుతున్నారు.

 

భారత్-నేపాల్- చైనా మూడుదేశాల కూడలి ప్రాంతంలో లిపులేఖ్ ఉంటుంది. కైలాశ్-మానస సరోవర్ యాత్ర దూరాన్ని తగ్గించేందుకు ఉత్తరాఖండ్‌లోని ధార్చులా నుంచి లిపులేఖ్ వరకు భారత్ ఇక్క‌డ రోడ్డు నిర్మాణం చేప‌ట్టింది. దీన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్ర‌వారం ప్రారంభించారు. అయితే, ఈ రోడ్డు ప‌నులు ప్రారంభించడం పట్ల నేపాల్ విచారం వ్యక్తం చేసింది. నేపాల్ భూబాగం గుండా ఆ రోడ్డు పోతుందని పేర్కొంది. కఠ్మాండూలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాట్రాను విదేశాంగ శాఖకు పిలిపించి విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావలీ దౌత్యపరమైన నిరసన లేఖను అందించినట్టు తెలిసింది. తక్షణమే భారత్‌తో సరిహద్దు చర్చలు జరపాలని భావిస్తున్నట్టు గ్యావలీ తెలిపారు. అందుకు కోవిడ్-19 మహమ్మారి అంతమయ్యేవరకు ఆగాల్సిన అవసరం లేదని  కూడా ఆయన అన్నారు. ప్రధానమంత్రుల స్థాయి, విదేశాంగ కార్యదర్శుల స్థాయి.. ఇలా భారత్‌తో ఏస్థాయిలోనైనా చర్చలకు సిద్ధమేనని నేపాల్ మంత్రి అన్నారు. భారత్ తో వివాదం తేలిన తర్వాత చైనాతోనూ చర్చలు జరుపుతామని పార్లమెంటు అంతర్జాతీయ సంబందాల కమిటీకి చెప్పారని కఠ్మాండూ పోస్ట్ వెల్లడించింది.

 


మ‌రోవైపు లిపులేఖ్ ప్రాంతం తన భూభాగంలోకి వస్తుందని నేపాల్ అంటుండటాన్ని భారత్ తిరస్కరించింది. లిపులేఖ్ పూర్తిగా భారత్ భూభాగంలోనిదేనని శనివారం స్పష్టం చేసింది. కైలాశ్-మానసససరవర్ యాత్రకు ఇదివరకు ఉపయోగించిన మార్గంలోనే ఈ రోడ్డును నిర్మించామని విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. సరిహద్దు వివాదాలపై చర్చించుకునేందుకు భారత్, నేపాల్ దేశాలకు సువ్యవస్థిత యంత్రాంగం ఉన్నదని అన్నారు. నేపాల్‌తో సరిహద్దును ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని, మిగిలిపోయిన సరిహద్దు సమస్యలను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేది భారత్ అభిమతమని అనురాగ్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: