తెలంగాణ రాష్ట్రంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 79 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. గత మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న నమోదైన కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 
 
ఏప్రిల్ నెల 3వ తేదీన రాష్ట్రంలో 75 కేసులు నమోదు కాగా నిన్న 79 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 11 రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 222 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్ అయిన తెలంగాణ సర్కార్ హైదరాబాద్ నగరంలో మాత్రం వైరస్ ను కట్టడి చేయడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. నిన్న నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1275కు చేరింది. 
 
గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెంచామని... అందువల్లే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన కార్మికులకు విసృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్టులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. 
 
రాష్ట్రంలో నిన్న 50 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 801కు చేరింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వల్ల ఇప్పటివరకు 30 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో గత 14 రోజుల్లో పాజిటివ్ కేసులు నమోదు కాని జిల్లాలు 26 ఉన్నాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: