హైద‌రాబాద్‌లో క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తోంది. ఊహ‌కంద‌ని విధంగా వైర‌స్ వ్యాప్తి చెందుతోంది. సోమవారం ఒక్క‌రోజే ఏకంగా 79 కేసులు నమోదు కావడంతో గ్రేటర్‌వాసుల్లో వ‌ణికిపోతున్నారు. ఇక్క‌డ ఆందోళ‌న క‌లిగించే విష‌యం ఏమిటంటే.. ఎక్కువ‌గా బాధితులు కుటుంబ స‌భ్యులే ఉంటున్నారు. ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌ రేస్‌కోర్స్‌ రోడ్‌ లైన్‌ లోని సాధన అపార్ట్‌మెంట్‌లో రెండు రోజుల క్రితం ఓ వృద్ధురాలికి (65) కరోనా పాజిటివ్‌ రాగా, సోమవారం ఆమె భర్తకు (70), కోడలు (35) లకు వైర‌స్ సోకింది. దీంతో అధికారులు వెంట‌నే వీరిని గాంధీ ద‌వాఖాన‌కు తరలించారు. అలాగే.. అక్బర్‌బాగ్‌ డివిజన్‌ పల్టాన్‌కు చెందిన వ్యక్తికి (55)కు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం అతడి కుమారుడికి కూడా (21) పాజిటివ్‌ రావడంతో గాంధీ ద‌వాఖాన‌కు తరలించారు.

 

అదేవిధంగా అల్లాపూర్‌ డివిజన్‌ రాజీవ్‌గాంధీనగర్‌లో ఓ హమాలితో పాటు ఏడుగురు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే అతడి కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్న మరో ముగ్గురికి పాజిటివ్‌ రావడంతో అధికారులు సోమవారం వారిని ద‌వాఖాన‌కు తరలించారు.  కిషన్‌బాగ్‌ డివిజన్, కొండారెడ్డిగూడలో సోమవారం నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలో గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం  40 మంది పరీక్షల నిమిత్తం ఆయుర్వేద ద‌వాఖాన‌కు  రాగా వారికి పరీక్షలు నిర్వహించగా 13 మందికి  పాజిటివ్‌గా వ‌చ్చింది. జియాగూడలో కరోనా పాజిటివ్‌ సోకిన కుటుంబాల నుంచే సోమవారం 25 కరోనా పాజిటివ్‌ కేసులు న మోదు కావడం గమనార్హం.

 

సికింద్రాబాద్‌ విజయ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో ఓ మహిళ రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. మలక్‌పేట్‌లోని గంజ్‌లో పని చేస్తున్న ఈమె తల్లికి పాజిటివ్‌ రావడంతో అధికారులు సదరు ఉద్యోగినికి కూడా పరీక్షలు నిర్వహించడంతో సోమవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆమెతో సన్నిహితంగా ఉంటున్న 12 మంది ఉద్యోగులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం డయాగ్నస్టిక్‌ కేంద్రాన్ని సీజ్‌ చేశారు. ఈ నేప‌థ్యంలో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జియాగూడ డివిజన్‌లో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తూ రాకపోకలను పూర్తిగా నిషేధించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: