కరోనా లాక్‌డౌన్ సమయంలో చాలా మంది పేదలకు ప్రభుత్వం వారు ఇచ్చే రూ. 1500 చాలా వరకు ఆసరగా నిలుస్తున్నాయి.. అయితే ఈ డబ్బులు అందరికి అందడం లేదనే విషయం తెలిసిందే.. కొందరికి రెండు, మూడు అకౌంట్లు ఉండటం వల్ల, మరి కొందరికి అసలు పడిన డబ్బులు ఎలా తీసుకోవాలో తెలియకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అసలు డబ్బులు పడినా తీసుకోవడానికి వీలులేని వారు కూడా ఉన్నారు.. ఈ నేపధ్యంలో పేదల ఆశను, బలహీనతను ఆసరాగా తీసుకున్న కేటుగాళ్లూ వారి నుండి అందినకాడికి దోచుకుంటున్నారు..

 

 

అది కూడా ఎలాంటి అనుమానం రాకుండా.. వారు అమాయకులను నమ్మించే క్రమంలో ముందుగా.. హలో.. మేం ముఖ్యమంత్రి సహాయ నిధి విభాగం నుంచి ఫోన్‌ చేస్తున్నాం. మీ ఖాతాలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన లాక్‌డౌన్‌ సాయం రూ.1500 జమయ్యాయా.. ఒకవేళ కాకుంటే.. బ్యాంకు ఖాతా నంబర్‌, డెబిట్‌ కార్డు నంబర్‌, సీవీవీ, ఓటీపీ నంబర్లను చెప్పండి. వెంటనే నగదును మీ ఖాతాలో జమచేస్తాం అంటూ మాట్లాడి పాపం అమాయకుల నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు సైబర్‌ నేరగాళ్లు..

 

 

ఇప్పుడు ఎక్కువగా ఇలాంటి మోసాలే జరుగుతున్నాయని తేలింది.. ఇకపోతే వీరి ఫోన్‌కాల్ స్వీకరించిన వారు అది నిజమని నమ్మి బ్యాంకు ఖాతాతో పాటు డెబిట్‌ కార్డు వివరాలను సమర్పించుకుంటున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల బారిన గ్రామీణులే ఎక్కువగా పడుతున్నారట. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ సహాయం పేరుతో కేటుగాళ్లు సులువుగా ఇలా అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు..

 

 

అందుకని ఇలాంటి వారి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా ఫోన్‌ చేసి ఖాతాలో నగదు జమ చేస్తామంటే మీ వివరాలు ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అంతే కాకుండా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి పరిహారం ఇస్తామని ఎవరూ ఫోన్లు కూడా చేయరని వారు చెబుతున్నారు.. ఇకపోతే రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు ఇటీవల 10కి పైగా బయటికి వచ్చినట్లు సైబర్‌ క్రైం పోలీసులు పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: