ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కరోనా  వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కేసులను గుర్తిస్తూ వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచుతూ ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇక అటు జనాలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ కరోనా వైరస్ లక్షణాలు ఉండగానే డాక్టర్ను సంప్రదిస్తూ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసుకుని.. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. అయితే ఒకవేళ వైరస్ ఉండి  ఐసొలేషన్  వార్డులో చికిత్స తీసుకుంటున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది.వైరస్ తొందరగా తగ్గితే  బాగుండు ఇంటికి వెళ్లిపోవచ్చు అని అనుకుంటారు. ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం వైరస్ తగ్గితే నాకేంటి తగ్గక పోతే నాకేంటి నన్ను మాత్రం ఇంటికి పంపించండి అంటూ హల్చల్ చేశాడు.

 

 

 వెంటనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలి అంటూ తాజాగా గాంధీ ఆసుపత్రి లో హల్చల్ చేసినట్లు సమాచారం. తనను  ఇంటికి పంపించకపోతే ఆహారం తీసుకోను  అని భీష్మించుకు కూర్చోవడంతో సమాచారం అందుకున్న ఆసుపత్రి అధికారులు ఆ వ్యక్తిని సముదాయించినట్లు తెలుస్తోంది. సూర్యాపేటకు చెందిన ఆ కరోనా  బాధితుడు గత నెల రోజుల నుండి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 14 రోజుల తర్వాత రెండు మూడు సార్లు మళ్ళీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసినప్పటికీ పాజిటివ్ గానే  తేలడంతో డాక్టర్లు అతని డిష్ఛార్జ్  చేయలేదు. 

 

 

 దీంతో ఎంత మొరపెట్టుకున్నా డాక్టర్లు తనను డిశ్ఛార్జ్  చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన కరోనా రోగి... పదిహేను రోజుల క్రితం వచ్చిన వారిని డిశ్చార్జ్ చేస్తున్నారు కానీ నేను వచ్చి నెల అయిపోతున్న ఇప్పటికీ ఇంకా చేయడం లేదు అంటూ ఆరోపిస్తూ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. అయితే 14 రోజుల అనంతరం నెగటివ్ వచ్చిన తర్వాతనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని ప్రజలు కూడా తమకు సహకరించాలని అధికారులు సదరు రోగిని సముదాయించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: