దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలందరినీ కరోనా భయం వెంటాడుతోంది. కరోనా ఎప్పుడు, ఎవరికి ఎలా సోకుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కరోనా విజృంభణ నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లోని అపార్టుమెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
అపార్టుమెంటు వాసులు కొత్తవారిని అనుమతించరాదని ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే 11,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. వారికి కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ నిలిపివేస్తామని ప్రకటన చేసింది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గజియాబాద్ లో మూడు సొసైటీలు ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లలోకి వెళ్లాయి. 
 
మరోవైపు ఇతర నగరాల్లో కూడా అపార్టుమెంట్ వాసులకు ఓనర్లు కొత్త నిబంధనలు పెడుతున్నారు. కరోనా సోకకుండా కొత్త నిబంధనలను అమలులోకి తెస్తున్నారు. కరోనా వేగంగా విజృంభిస్తూ ఉండటంతో వైరస్ భారీన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. కరోనా సోకకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. 
 
మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలో ఈరోజు 33 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మృతుల సంఖ్య 46కు చేరింది. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 584 కరోనా కేసులు నమోదు కాగా విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 4 కేసులు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలో నిన్న 75 కరోనా కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 1275కు చేరింది. రాష్ట్రంలో 30 మంది కరోనా భారీన పడి మృతి చెందారు.                     
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: