ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు మధ్య ఎంతటి స్నేహం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక వివాదాలపై వీరిద్దరూ కలిసికట్టుగా కూర్చుని పరిష్కారం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎటువంటి వివాదాలకు వెళ్లకుండా, సామరస్యపూర్వకంగా అప్పటి వాతావరణం నడిచింది. రాజకీయంగానూ ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ తమ ఉమ్మడి శత్రువైన చంద్రబాబును  ఇరుకున పెట్టే విధంగా ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు మిత్రుల మధ్య తాజాగా ఓ వివాదం చెలరేగింది. విభజన చట్టాలకు తూట్లు పొడిచేలా,  ఏపీ ముఖ్యమంత్రి కృష్ణా జలాల విషయంలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడంతో కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

 
 
 ప్రతి దశలోనూ ఏపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నా, ఏపీ ప్రభుత్వం ఈ విధంగా చేయడం ఏంటి అంటూ కేసీఆర్ జగన్ తీరుపై మండిపడుతున్నారు. నిన్న ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత వనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేసిఆర్ ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ ఈ విషయంపై న్యాయస్థానాల్లో తేల్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈ వివాదం చెలరేగడానికి కారణం ఏమిటంటే, సంగమేశ్వరం నుంచి శ్రీశైలం కుడికాలువ లోకి రోజుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించేలా, ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పోతిరెడ్డిపాడు కు నాలుగు కిలోమీటర్ల దూరంలో సంగమేశ్వరం నుంచి నీటిని ఎత్తి పోసి శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి పోయడం, పోతిరెడ్డిపాడు, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ లను 80వేల క్యూసెక్కులు తీసుకెళ్లా పటిష్టం చేయడం, ఇలా అనేక పనులను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 
 
 
ఈ మేరకు 7 వేల కోట్లతో ఫస్ట్ ఫేస్ కింద పనులు చేపట్టేందుకు అనుమతులు కూడా ఇచ్చారు. అయితే ఈ విషయంపై కెసిఆర్ ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేయడం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా కట్టడి విషయంలోనూ, లాక్ డౌన్ అమలు తీరు విషయంలోనూ కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని బిజెపి కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. అంతేకాకుండా కేసీఆర్ పరిపాలనపై ప్రజల్లోనూ అసహనం మొదలైనట్లుగా నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందడంతో ఆ విషయాల నుంచి ప్రజలను, ప్రతిపక్షాలను డైవర్ట్ చేసి సెంటిమెంట్ రాజేసే  విధంగా ఇప్పుడు కేసీఆర్ పోతిరెడ్డిపాడు అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. 
 
 
అసలు జగన్ తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కెసిఆర్ ఏం చెప్పినా, దానికి సానుకూలంగానే జగన్ స్పందిస్తూ ఉంటారు. ఆ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. అయినా ఆయన దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయడం వెనుక కరోనా, మిగతా విషయాల్లో ప్రతిపక్షాలు కార్నర్ చేయకుండా, ముందు జాగ్రత్తగా పోతిరెడ్డిపాడు అంశాన్ని కెసిఆర్ తలకెత్తుకుని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: