ఐదు రోజుల క్రితం విశాఖ జిల్లా ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజ్ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం గ్యాస్ లీకేజీ ప్రభావం పడిన ఐదు గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నిన్న సీఎం ఆదేశాల మేరకు బాధితులను సొంతూళ్లకు తరలించారు. వైసీపీ మంత్రులు నిన్న రాత్రి బాధితుల గ్రామాల్లో బస చేశారు. జిల్లా ఇన్ చార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎల్.జి. పాలిమర్స్ బాధితులు ఏ ఒక్కరూ తప్పిపోకుండా ఎన్యూమరేషన్ చేయిస్తున్నట్లు తెలిపారు. 
 
ఈరోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కన్నబాబుతో పాటు పాల్గొన్నారు. మంత్రి కన్నబాబు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, అందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఆస్పత్రుల్లో 367 మంది చికిత్స పొందుతున్నారని ఈరోజు 200 మందిని డిశ్చార్జ్ చేయనున్నట్టు ప్రకటన చేశారు. 
 
సీఎం ఆదేశాల మేరకు పూర్తి ఆరోగ్యంతో విడుదలైన వారికి ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించి వారి స్వగృహాలకు పంపనున్నట్లు ప్రకటన చేశారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కె.జి.హెచ్.లో 300 మంది చికిత్స పొందుతున్నారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 67 మంది ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చిందని.... గ్రామస్తుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఆయా గ్రామాల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు బస చేశారని పేర్కొన్నారు. 
 
వైద్య బృందాలు గ్రామాలకు వెళ్లి పరీక్షలు చేయనున్నట్టు ఆయన ప్రకటన చేశారు. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పరిహారం అందించేందుకు ఎన్యూమరేషన్ జరుగుతోందని చెప్పారు. విజయసాయిరెడ్డి కె.జి.హెచ్.లో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. విజయసాయిరెడ్డి బాధితులకు 25 వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఏడాది పాటు ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటన చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: