దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ 3000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. కరోనా చికిత్స కోసం భారత్ యాంటీ వైరల్ ఔషధం ఫవిపిరవిర్ ను తయారు చేసింది. 
 
ఈ వ్యాక్సిన్ ను మూడో దశలో భాగంగా కరోనా రోగులపై ప్రయోగించనుంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గత నెలలో ఈ డ్రగ్ ను పరీక్షించేందుకు అనుమతులు ఇచ్చింది. గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ అనే సంస్థ భారత్ లో కరోనాను నయం చేసే సామర్థ్యంపై జరుపుతున్న పరీక్షల్లో మూడో దశకు చేరుకున్న తొలి సంస్థ అని ప్రకటించింది. ఆగష్టు నెల నాటికి పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. 
 
రోగుల చికిత్సకు 14 రోజుల సమయం పడుతుందని... అధ్యయనం మొత్తం పూర్తవడానికి 28 రోజుల సమయం పడుతుందని పేర్కొంది. డ్రగ్ తయారీ కోసం యాక్టివ్ ఫార్మా ఇన్ గ్రేడియంట్ సంబంధిత సూత్రీకరణలను సైతం రూపొందించినట్లు తెలిపింది. సంస్థ ఉపాధ్యక్షురాలు మోనికా టాండన్ మాట్లాడుతూ ఈ ప్రయోగాలు విజయవంతమైతే కరోనా చికిత్సలో మరో ముందడుగు పడినట్టేనని పేర్కొన్నారు. 
 
ఫవిఫిరవిర్ ఔషధాన్ని జపాన్ లో ఇన్ ఫ్లుయంజా వ్యధిగ్రస్తుల కోసం కనిపెట్టారు. ఇప్పటికే పలు దేశాల్లో ఈ ఔషధాన్ని కొంతమందిపై ప్రయోగించగా దీని వల్ల బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నట్టు తేలింది. మరోవైపు భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 70,000 దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 22455 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2293 మంది కరోనా భారీన పడి మృతి చెందారు.                    

మరింత సమాచారం తెలుసుకోండి: