ప్రపచంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎన్నో జాగ్రత్తలు పడుతున్నారు. ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని విల విలలాడుతుంది. ఇక భారత్ లో కరోనా వైరస్ నిర్మూలించేందుకు మార్చి నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కరోనాకు వ్యాక్సిన్ కనుగొనలేకపోయారు.  అన్ని దేశాల వారు కరోనా వ్యాక్సిన్ కనుగొనే పనిలో ఉన్నారు. అయితే ఈ కరోనాకి మందు లేదు జాగ్రత్తలు పాటించాల్సిందే అని సూచిస్తున్నారు. బయటకు వస్తే తప్పని సరి మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని.. ఎవరైనా తుమ్మినా, దగ్గినా దూరంగా ఉండాలని.. బయట ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మి వేయరాదని సూచనలు ఇస్తున్నారు. అందే కాదు ప్రతిరోజూ దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకటనలు కూడా ఇస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇలాంటివి తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.  

 

లాక్ డౌన్ ఉల్లంఘన, మాస్క్ లేకుండా గుంపులుగా ఉండటం.. రోడ్లపై ఇష్టమున్నట్టు ఉమ్మివేయడం చేస్తున్నారు.  ఇన్నిరోజులూ నోళ్లల్లో తట్టెడు తట్టెడు పాన్ పరాగ్‌లు నములుతూ ఎక్కడ ఉమ్మినా పోనీలే అని ఊరుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. నిర్లక్ష్యంగా రోడ్ల మీద ఉమ్మేస్తే ప్రభుత్వాలు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చండీగడ్‌లో ఓ వ్యక్తి రోడ్డు మీద ఉమ్మాడు. అంతే ట్రాఫిక్ పోలీసులు అతనిచేతే ఉమ్మిన చోటు శుభ్రంగా కడిగించారు. టూవీలర్‌పై వెళుతున్న ఓ యువకుడు నడిరోడ్డుపై తుపుక్కున ఉమ్మేసి వెళ్లిపోతున్నాడు.

 

అతను ఉమ్మడాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీస్ అతన్ని వెంటనే ఆపాడు. అయితే తాను చేసింది తప్పే అని తెలిసి ఫైన్ వేస్తే కట్టేసి వెళ్లిపోతాం అనుకున్నాడు. కానీ అధికారులు అతను ఊహించని శిక్ష వేశారు అతనికి. ఉమ్మి వేశావు కాబట్టి నీ చేత్తో నువ్వే ఆ దరిద్రాన్ని కడిగేసెయ్ అని ఓ వాటర్ బాటిల్ చేతికందించారు. దీంతో అతను షాక్ అయ్యాడు.  కడిగేటప్పుడు తన ఉమ్మిని తానే ఛీఛీ అనుకున్నాడు. జీవితంలో మరోసారి రోడ్డుపై ఉమ్మివేయనని బుద్దొచ్చింది బాబో అంటూ వెళ్లిపోయాడు. తాజాగా ఈ వీడియో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: