బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు...ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ముఖ్యంగా టీడీపీ వాళ్లకు ఈయన బాగా తెలుసు. ఎందుకంటే గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీని ముప్పు తిప్పలు పెట్టారు. ఎప్పుడు పడితే మీడియా సమావేశం పెట్టడం, బాబు ప్రభుత్వంపై విరుచుకుపడటం చేసేవారు.

 

మొదట్లో టీడీపీతో కలిసి బీజేపీ పొత్తులో ఉన్నాసరే ఈయన మాత్రం విమర్సలు చేయడంలో ఏ మాత్రం వెనక్కితగ్గేవారు కాదు. ఇక పొత్తు పోయాక అయితే చెలరేగిపోయారు. వైసీపీ కంటే ఎక్కువగా బాబు అండ్ బ్యాచ్ పై విమర్సలు చేసేవారు. టీడీపీ ఓటమికి కూడా తనవంతు కృషి కూడా చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చాక వీర్రాజు కాస్త చల్లబడ్డారు.

 

ఈ సంవత్సర కాలంలో జగన్ ని ఒక్కమాట అన్న సందర్భం పెద్దగా లేదనే చెప్పుకోవాలి. టీడీపీతో సహా జనసేన, మిగిలిన బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నా కూడా వీర్రాజు బయటకు రాలేదు. కానీ తాజాగా తన జిల్లా తూర్పుగోదావరిలో వైసీపీ నేతలు భూ పంపిణీ కార్యక్రమంలో భారీగా అక్రమాలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సమయంలో వీర్రాజు, సీఎం జగన్ కు ఓ లేఖ రాసారు.

 

రాజమహేంద్రవరం రూరల్ కోరుకొండ మండలంలో భూముల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి స్పందించి తక్షణమే ఆ భూముల కొనుగోలును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్షం వస్తే మునిగిపోయే ఈ ప్రాంతం నివాసయోగ్యం కాదని, ఈ భూమి కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇక రూ.25 లక్షల విలువ చేసే భూమిని రూ.40 లక్షలకు కొన్నారని, ఇందులో అవినీతి జరిగిందని కాబట్టి జగన్ దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

అయితే వీర్రాజు రాసిన లేఖ కర్రా విరగకుండా, పాము చావకుండా అన్నట్లుగా ఉందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. చంద్రబాబుపై ఒంటి కాలి  మీద లేచే వీర్రాజు...ఇప్పుడు ఇంత జరుగుతున్న జగన్ ని ఒక్కమాట అనకపోవడం విచిత్రంగా ఉందని అంటున్నారు. రాజమహేంద్రవరం టీడీపీ నేతలు దీనిపై పోరాటం చేస్తున్నారు కాబట్టి, వీర్రాజు ఏదో మొక్కుబడిగా లేఖ రాసారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: