తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పోతిరెడ్డి పాడు ఎత్తిపోత‌ల ప‌థకం రాజ‌కీయ ర‌గ‌డ‌కు వేదిక‌గా మారుతోంది. ఏపీ ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా తీసుకున్న నిర్ణ‌యం స‌రికాద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూటిగా చెప్పేశారు. అయితే.. అదేస్థాయిలో ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా స‌మాధానం ఇచ్చారు. తెలంగాణ‌కు న‌ష్టం చేసేలా ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోలేద‌ని, శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న‌ అద‌న‌పు జ‌లాల‌ను మాత్ర‌మే వినియోగించుకుంటున్నామ‌ని సీఎం జ‌గ‌న్ చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. పోతిరెడ్డిపాడు ఎత్తిపోత‌ల ప‌థ‌కం విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నేత‌లు, తెలంగాణ బీజేపీ నేత‌లు ఇరుక్కుపోయారు. ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ తెలంగాణ బీజేపీ నేత‌లు ఈరోజు నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు. సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జ‌గ‌న్‌తో కుమ్మ‌క్కై తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టుపెడుతున్నార‌ని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆరోపిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై తెలంగాణ ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డం స‌రికాద‌ని ఏపీ బీజేపీ నేత‌లు అంటున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల క‌మ‌లం నేత‌లు ఏకాభిప్రాయం లేకుండా ఎవ‌రివాద‌న‌వారు వినిపిస్తూ ఇరుక్కుపోతున్నారు. ఇక్క‌డే టీఆర్ఎస్ నేత‌లు సూటిగా ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఏపీ బీజేపీ నేతలను దమ్ముంటే ప్రశ్నించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. పోతిరెడ్డిపాడుపై ఏపీ బీజేపీ నేతలు ఓ రకంగా, తెలంగాణ బీజేపీ నేతలు మరోరకంగా మాట్లాడుతూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. వీరిలో ఎవరి విధానం సరైనదో ఆ పార్టీ జాతీ య నాయకత్వం స్పష్టంచేయాలని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుపై బీజేపీలో ఏకాభిప్రాయం వచ్చాక మాట్లాడితే మంచిదని సంజయ్‌కు సూచించారు.బుధవారం నల్లజెండాలతో ప్రదర్శనలు జరుపాలని బండి పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై ఇరు రాష్ట్రాల బీజేపీ నేత‌లు ఏం చెబుతారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: