ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మన వాటా నీళ్లు మనం వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించినట్లు సమాచారం. ఏపీకి కేటాయించిన నీటిని పక్కాగా వాడుకునేందుకు మన భూభాగంలో ప్రాజెక్టు కట్టుకుంటే తప్పుపట్టవలసిన పనేమిటి అని జగన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 
 
కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది కదా...? అని జగన్ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం. రాయలసీమ ప్రాంతంలో కృష్ణా జలాలను వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం ఇవ్వడం.... ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై కేసీఆర్ స్పందించడం తెలిసిందే. రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు ప్రజలు తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని... వారిని ఆదుకోవడానికే ప్రాజెక్ట్ కట్టుకుంటున్నామని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. కృష్ణా బోర్డు నీటి పంపకాలను పర్యవేక్షిస్తున్న తరుణంలో ఈ అంశాలను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అని జగన్ ప్రశ్నించినట్టు సమాచారం. 

 
ప్రాజెక్ట్ ద్వారా ఏపీ, తెలంగాణ ఏ స్థాయి నీటిమట్టం దగ్గర ఎంత నీరు తీసుకోగలదనే విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. ఏపీకి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని... కృష్ణా నదిలో నీటిమట్టం 881 అడుగులు ఉన్నప్ప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి నీటిసరఫరా సాధ్యమవుతుందని... కేవలం పది రోజులు మాత్రమే ఆ స్థాయి నీటిమట్టం ఉంటుందని అధికారులతో చెప్పినట్టు సమాచారం. 
 
ఏపీ విశ్రాంత ఇంజనీర్ల సంఘం రాయలసీమకు తాగునీటిని అందించేందుకు... వరద జలాలతో అక్కడి ప్రజలకు జీవనోపాధి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలు సహా కరువు నివారణ పథకం చేపట్టిందని పేర్కొంది. వరద జలాల సమర్థ మళ్లింపే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఘర్షణ సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఇంజనీర్ల సంఘం అభిప్రాయపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: