ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజా సంక్షేమ పాలనే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, ఎన్నికల తరువాత ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా జగన్ సర్కార్ విశాఖ గ్యాస్ లీకేజ్ బాధితులకు పరిహారం అందించే పనిలో ఉంది. ప్రభుత్వం ఇప్పటికే మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులను పంపిణీ చేసింది. 
 
రెండు రోజుల క్రితం మంత్రులు అస్వస్థతకు గురైన వారికి 25,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. తాజాగా జగన్ సర్కార్ బాధిత గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ 10,000 రూపాయల చొప్పున నగదు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ప్రభావిత ఐదు గ్రామాల్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 10,000 రూపాయల చొప్పున ఇంటి యజమాని ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. 
 
వాలంటీర్లు గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం ఐదు గ్రామాల్లోని ప్రజల కోసం ఐదు వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. 90 శాతం ప్రజలు ఇప్పటికే వారి గ్రామాలకు ఇప్పటికే చేరుకున్నారు. బాధిత గ్రామాల ప్రజలకు మంచి నీరు సరఫరా చేస్తున్నామని... ఐదు గ్రామాల ప్రజలు యథావిధిగా తమ పనులు చేసుకోవచ్చని మంత్రులు చెప్పారు. బాధిత గ్రామాల ప్రజలకు ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు. 
 
కొందరు బాధితులకు అన్యాయం జరిగిందనే భావన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కేజీహెచ్ లో బాధితులు ఎన్ని రోజులైనా చికిత్స తీసుకోవచ్చని మంత్రులు తెలిపారు. పది మంది వైద్యులతో మెడికల్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం బాధిత గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నా ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం.         

మరింత సమాచారం తెలుసుకోండి: