రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన పార్టీగా ముద్ర వేయించుకోవాలని చూస్తున్న బిజెపి దానికి అనుగుణంగా ప్రజా సమస్యలను హైలెట్ చేసుకుని పోరాడే విషయంలో గతం కంటే ఇప్పుడు చురుగ్గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో 2024 నాటికి అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. అదే స్థాయిలో బలపడాలనే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా ఏపీ సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం కారణంగా ఇప్పుడు బిజెపి కొత్త చిక్కుల్లో పడింది. రాయలసీమకు సాగు, తాగునీరు అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు విషయంలో బిజెపి తెలంగాణ,  ఆంధ్ర ప్రాంతాలుగా విడిపోయారు. జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

 
 
జగన్ తీసుకొన్న నిర్ణయం రాయలసీమకు మేలు చేసేదని, రాయలసీమకు సాగు, తాగునీరు అందుతుందని, ఈ విషయంలో కేసీఆర్ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా, తాము మద్దతు ఇస్తామంటూ ఆయన ప్రకటన చేయగా, తెలంగాణ బిజెపి నాయకులు మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ నిరసన దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బిజెపి కార్యాలయంలో దీక్షకు దిగగా, మాజీమంత్రి ప్రస్తుత బీజేపీ నాయకురాలు డీకే అరుణ హైదరాబాద్ లోని తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. 
 
 
అలాగే బిజెపి కీలక నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి సైతం ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలా రెండు ప్రాంతాలకు చెందిన నాయకులు విభిన్న ప్రకటనలు చేస్తుండడంతో బీజేపీ అధిష్టానం అయోమయంలో పడిపోయింది. ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన విషయం కావడంతో నేతలు రాష్ట్రాల వారీగా విడిపోయి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో  తమ రాజకీయ ప్రత్యర్ధులు బిజెపి అధిష్టానం నిర్ణయం ఎంటో స్పష్టంగా తెలియజేయాలనే డిమాండ్ తెరపైకి తెచ్చే అవకాశం ఉందని, అప్పుడు రెండు రాష్ట్రాల వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది ఏమో అన్న సందేహంలో బీజేపీ పెద్దలు ఉన్నారు. ఈ విషయం ఏ రాష్ట్రానికి మద్దతు పలికినా చిక్కులు పడాల్సిందే అన్న సందేహం వారిలో కనిపిస్తోంది. మొత్తానికి జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా బిజెపి అయోమయంలో పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: