దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 75,000కు చేరింది. ఇప్పటివరకు 25,000 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మృతుల సంఖ్య 2,400 దాటింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పైనే ఆధారపడ్డాయి. 
 
లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం డిగ్రీ పరీక్షలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. మొదట డిగ్రీ మూడవ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలనుకున్న ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులందరికీ ఒకేసారి అన్ని పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. 
 
తెలంగాణ ఉన్నత విద్యామండలి మరో రెండు మూడు రోజుల్లో అన్ని యూనివర్సిటీలకు డిగ్రీ పరీక్షలకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేయనుంది. అధికారులు జూన్ 20వ తేదీ నుంచి డిగ్రీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డిగ్రీ ఫలితాలకు, పీజీ ప్రవేశాలకు సంబంధం ఉండటంతో మొదట మూడవ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావించారు. 
 
కానీ మూడవ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తే గత రెండు సంవత్సరాల సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అధికారులు లాక్ డౌన్ నేపథ్యంలో ప్రశ్నాపత్రాల్లో కీలక మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అధికారులు ప్రశ్నలను తగ్గించి ఒక్కో ప్రశ్నకు గతంలో కన్నా మార్కులు పెంచనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 51 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1326కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 32 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: